ఖైరతాబాద్, సెప్టెంబర్ 24: సమగ్ర కులగణ, బీసీ రిజర్వేషన్ల పెంపే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పలువురు బీసీ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ బీసీ మహాసభ జెండావిష్కరణ సభలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే కామారెడ్డి డిక్లరేషన్ కేవలం బీసీల ఓట్ల కోసమే నాడు చేసినట్టున్నదని, దానిని అమలుచేసి తీరాల్సిందేనని వక్తలు డిమాండ్ చేశారు. 76 ఏండ్లలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు తొలినాళ్ల నుంచి బీసీలను ఓట్లుగానే చూశాయి తప్ప రాజ్యాధికారంలో వారికి స్థానం ఇవ్వలేదని తెలిపారు. ఐదు శాతం కూడా లేనివారే ఆ పదవులను అనుభవిస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం బీసీలు చైతన్యవంతులయ్యారని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల్లోబడుగు, బలహీనవర్గాలే ఎక్కువ మంది బాధితులుగా మారుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బడుగు, బలహీనవర్గాల ప్రాతినిధ్యం పెరగాలని, ఆ వర్గాలన్నీ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కొడంగల్ నియోజకవర్గంలోని నారాయణపేట ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖరారాయ్యాయని, రూ.2,300 కోట్ల టెండర్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డకే వచ్చాయని, ఇందులో బీసీల కోటా ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో బీసీల కోటా ఎంత ఉంటుందో చెప్పాలని మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రశ్నించారు.
సమగ్ర కులగణనపై 28న కల్వకుర్తిలో బీసీ మహా ధర్నాను నిర్వహించనున్నట్టు తెలిపారు. సభలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ సురేశ్ ముదిరాజ్, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిడికిలి రాజు, కేవీ గౌడ్, నిర్మాత, నటి కీర్తి లతాగౌడ్, బీసీ నాయకులు నిర్మల శ్రీశైలంగౌడ్, సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, దాసరి కిరణ్, నరేశ్ ముదిరాజ్, వెంకటయ్య యాదవ్ పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన సభ్యత్వానికి సోమవారం సమర్పించిన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ మంగళవారం బులెటిన్‌ను విడుదల చేశారు. ఏపీకి చెందిన వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేండ్లపాటు ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 11 స్థానాలకు అన్నిస్థానాల్లో వైసీపీ గెలుచుకుని సంఖ్యాబలం పరంగా రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు సమర్పించారు. వారిబాటలో ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో వైసీపీకి రాజ్యసభలో సంఖ్యాబలం తగ్గింది.