హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-3 పరీక్షల్లో ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌పై ప్రశ్నవచ్చింది. ‘విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంలో ఐఐటీల్లో కోర్సులకు చాలా డిమాండ్ ఉంది’. ‘ఐఐటీల్లో 17వేల సీట్లున్నాయి. జేఈఈ మెయిన్స్‌కు ఏటా 12లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు’ అంటూ రెండు ప్రవచనాలిచ్చారు. వీటిలో సరైనది ఏదీ.. రెండు సరైనవే అంటూ ఆప్షన్లు ఇచ్చారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకాలపైనా గ్రూప్-3లో ప్రశ్నలిచ్చారు. హరితహారం, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి పథకాలు ఇచ్చి ఆయా పథకాల లక్ష్యం, ఉద్దేశాలను జతపరచమని ప్రశ్నలిచ్చారు. తెలంగాణ తల్లిపైనా ఒక ప్రశ్నను అడిగారు. సినిమాలపై రెండు ప్రశ్నలొచ్చాయి. 7వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2022 సంవత్సరానికి ఉత్తమ డాక్యుమెంటరీ, ఆస్కార్ అవార్డుకు నామినేట్అయిన ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ దర్శకుడు ఎవరు..? అంటూ ప్రశ్నలిచ్చారు.
గ్రూప్-3 పరీక్షను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా, కలెక్టర్లు, పోలీసులు పరీక్షాకేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రూప్ 3 పరీక్షకు సగం మంది మాత్రమే హాజరైయి నట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం పేపర్1 పరీక్షకు 51.1 శాతం, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 50.7శాతం మాత్రమే హాజరయ్యారని చెప్పారు.
పరీక్ష సందర్భంగా అరగంట ముందుగానే గేట్లు మూసివేశారు. ఉదయం సెషన్లో 9:30కు, మధ్యాహ్నం సెషన్లో 2:30గంటలకే గేట్లకు తాళం వేశారు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురు అభ్యర్థులు పరీక్షరాయకుండా వెనుదిరగాల్సి వచ్చింది. సికింద్రాబాద్‌లో ఇద్దరు, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్లో ఐదుగురు ఆలస్యంగా రాగా పరీక్షకు అనుమతించలేదు. ఆలస్యంగా వచ్చినందుకు అనుమతించకపోవడంతో పటాన్చెరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సెంటర్ ఎదుట ఓ అభ్యర్థి హాల్‌టికెట్‌ను చింపేసి వెనుదిరిగాడు. పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే సెంటర్లను ప్రధాన రోడ్లకు దూరంగా, గల్లీల్లోని విద్యాసంస్థల్లో పరీక్షాకేంద్రాల్లో వేశారు. ఆయా సెంటర్ల వద్దకు చేరుకోవడానికి అభ్యర్థులు తిప్పలు పడ్డారు. దీంతో పాటు పలు చోట్ల రోడ్ల మరమ్మతులు చేస్తుండటం, ట్రాఫిక్ మళ్లింపులతో సెంటర్లకు చేరుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది.
గ్రూప్-3 పరీక్షల్లో భాగంగా సోమవారం మూడో పేపర్‌కు పరీక్షను నిర్వహిస్తారు. మూడో పేపర్ అయిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్కు పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఆదివారం తీసుకెళ్లిన హాల్‌టికెట్‌తోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాలి. కొత్త హాల్‌టికెట్‌ను తీసుకెళితే పరీక్షకు అనుమతించరు.