హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించే ప్రశ్నోత్తరాలను ఇప్పటికే మూడుసార్లు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా తొమ్మిదో రోజు నాలుగోసారి రద్దు చేసింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. మంగళవారం సభ ప్రారంభమయ్యాక స్పీకర్ రాకముందే సభలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతరులు క్వశ్చన్ అవర్ నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును కోరారు.
క్వశ్చన్ అవర్ లేదని మంత్రి సమాధానం చెప్పడంతో.. క్వశ్చన్ అవర్, జీరో అవర్‌ను ఎత్తివేస్తే సభ్యుల పరిస్థితి ఏంటని కేటీఆర్, హరీశ్‌రావు ప్రశ్నించారు. జీరో అవర్ ఎత్తివేస్తే ఏమో కానీ, ప్రతిరోజూ క్వశ్చన్ అవర్ ఎలా ఎత్తివేస్తారు? అని నిలదీశారు. ఈ లోగా స్పీకర్ సభలోకి రావడంతో సభ ప్రారంభమైంది. ఇప్పటికే మూడుసార్లు క్వశ్చన్ అవర్ రద్దు చేసిన స్పీకర్.. తాజాగా మరోసారి రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.