హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నవభారత నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారతదేశానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. భారత ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంసరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా భారతరత్న పీవీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణానికి బాటలు వేస్తూ పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంసరణలు చరిత్రాత్మకమని పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు. నెక్లెస్‌రోడ్డుకు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపడంతో పాటు పీవీ కూతురును ఎమ్మెల్సీగా గౌరవించిందని తెలిపారు. పీవీ వర్ధంతిని పురస్కరించుకొని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘన నివాళులర్పించారు.
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించిన గొప్ప నాయకుడు మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో పీవీ వర్ధంతిని నిర్వహించారు. శాసనసభ భవనం పీవీ లాంజ్‌లో పీవీ చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ..
పీవీ దేశానికి ఎనలేని సేవలు అందించారని, ఎన్నో ఆర్థిక సంసరణలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. నిజాయితీ, నిరాడంబరానికి నిలువుటద్దం అని పేర్కొన్నారు. పీవీ చూపిన బాటలో మనమంతా పయనించాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పీవీ కుటుంబ సభ్యులు, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.