Puvvada Ajay Kumar | ఖమ్మం : ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో మంగళవారం స్థానికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
తుమ్మల తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ తన వ్యక్తిత్వాన్ని అధఃపాతాళానికి తొక్కేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉండి కూడా తుమ్మల గౌరవప్రదంగా మాట్లాడలేకపోతున్నారన్నారు. తనపై బట్ట కాల్చి మొహం మీద వేస్తానంటే.. ఊరుకోబోమని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తుమ్మల చిత్తు చిత్తుగా ఓడిపోతారన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు, కొత్తపల్లి నీరజ, చిరమామిళ్ల లక్ష్మీనాగేశ్వరరావు, రాయల శేషగిరిరావు, జకంపూడి వీరభద్రం, నలజాల రవి, మారగాని సుదర్శన్, రామారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.