ఖమ్మం, నవంబర్ 26: అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంటీలిస్తారని ఎద్దేవాచేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.
ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చినా వారికి పావలావంతు కూడా మేలు జరగలేదని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వస్తుండzం విడ్డూరంగా విమర్శించారు. 11 పర్యాయాల్లో చేయని అభివృద్ధిని ఇప్పుడెలా చేస్తారంటూ ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.
అందులో భాగంగానే నేడు తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనతను సొంతం చేసుకున్నదని వివరించారు. స్థానికేతరులతో నియోజకవర్గానికి ఉపయోగం ఏమీలేదని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలు, కష్టాలు తెలిసిన తనతోనే ఖమ్మం ఇంతలా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. తన వల్లే ఖమ్మం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల చెప్పుకుంటుండటం సిగ్గుచేటని విమర్శించారు. ఇక్కడి అభివృద్ధిని తుమ్మల చేసి ఉంటే అందుకు నిధులు ఇచ్చింది సోనియాగాంధీనా? అని ప్రశ్నించారు. 30న జరిగే ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.