పెద్దపల్లి: కుల గణన పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే, బీసీ నేత పుట్ట మధుకర్ (Putta Madhukar) విమర్శించారు. బీసీల జనాభా సంఖ్యను తగ్గించి, ఓసీల జనాభాను పెంచి వంచించే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో లఘు చర్చకు నిర్ణయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీసీల సమస్యను చర్చించేందుకు ఈ సర్కారుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఓట్ల పేరుతో బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుల గణనను చేపట్టిందని విమర్శించారు.
బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒలకబోస్తున్నది కపట ప్రేమ అని, కులగణన సర్వేతో అది మరోసారి తేటతెల్లం అయ్యిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల సంఖ్య గణనీయంగా తగ్గడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్త కులగణన చేపట్టడంతో పాటు ఎవరివాటా ఎంతో వారి వాటా ప్రకారం వారికీ కేటాయింపులు చెయ్యాలని చేస్తున్న డిమాండ్ ను ముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే బీసీ సంఘాలను సంఘటితం చేసి ప్రభుత్వం మెడలు వంచి తీరుతామన్నారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎస్సీలు మైనార్టీలు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.