హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అక్రమాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ప్రజలను, ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులపై రౌడీషీట్లు తెరవటానికే సమయాన్ని వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడిపై ఓ మహిళ ఫిర్యాదు చేస్తూ 45 రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. మంత్రి తమ్ముడికి ఏ హోదా ఉన్నదని భారీ పోలీస్ రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ ఇల్లును మంత్రి ఇటీవలే కూలగొట్టించారని, బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పోలీసులు తీసుకోవటం లేదని వాపోయారు.
ప్రతిపక్షంలో ఉండా మధిర ఎమ్మెల్యే (డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క) చీటికిమాటికి వచ్చేవారని, ఇప్పుడు మహిళల రోదనలు వినిపించటం లేదా? అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా? అని ప్రశ్నించారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.