హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మంత్రి శ్రీధర్‌బాబు అద్భుతమైన నటుడు.. అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్ కంటే అద్భుతంగా నటిస్తాడు.. మంథని నియోజకవర్గంలో అనేక చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఎద్దేవా చేశారు. ఆయనకు నటనలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరుతూ ఆస్కార్ కమిటీకి లేఖ కూడా రాశానని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంథని నియోజకవర్గంలో తెరవెను క ఎన్నో పనులు చేస్తూ, మంచివాడిగా చెలామణి అవుతున్న ఉత్తమ నటుడని, తప్పకుండా ఆస్కార్ అవార్డు ఇచ్చి తీరాల్సిందేనని వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. 2015లో మంథనిలో మధూకర్ అనే వ్యక్తిని చంపిన వారిపై ఆయన అన్న సమ్మయ్య, చంపిన వారి పేర్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదులు ఎదుర్కొంటున్న వారినే మంత్రి శ్రీధర్‌బాబు తన వెనుక పెట్టుకున్నారని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు, ప్రొటోకాల్ పరంగా అన్యాయం చేసింది కూడా ఈ మంత్రేనన్న సంగతి అందరికీ తెలిసిందేనని విమర్శించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గా మంథనికి ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు.