శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:00:52

మోటర్ల కొనుగోళ్లు ముమ్మరం

మోటర్ల కొనుగోళ్లు ముమ్మరం

  • పెరిగిన పైపులు, ఎలక్ట్రిక్‌ పరికరాల అమ్మకాలు
  • కరోనా వేళలోనూ తగ్గని వ్యాపారం
  • రాష్ట్రంలో బోర్లు, బావులు రీచార్జి
  • కాలువల నుంచీ పొలాలకు పైప్‌లైన్లు
  • వ్యవసాయంలో రైతన్నలు బిజీ
  • కాళేశ్వరంతో బహుళ ప్రయోజనాలు

రాష్ట్రంలో ఈ వానకాలంలో మోటర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కాళేశ్వరం కాలువలకు కూడా రైతులు పైప్‌లైన్లు వేసి బీడుభూములను సాగులోకి తెస్తున్నారు. వ్యవసాయ బావి, బోర్లకు కొత్త మోటర్లు, వాటినుంచి పొలాలకు నీటినందించేందుకు పైప్‌ల కొనుగోలుతో వాటి దుకాణాలు కళకళలాడుతున్నాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఓవైపు కాలువల ద్వారా పంటలకు సాగునీరందుతుండగా.. వేల సంఖ్యలో నింపిన చెరువులతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలైలో రాష్ట్రంలో భూగర్భజలమట్టం సగటున 9.26 మీటర్ల లోతుకు చేరుకున్నది. ఈ కారణంగా బావులు, బోర్లు రీచార్జి అవుతున్నాయి. పాతబావులు, గతంలో వేసిన బోర్లలో నీళ్లు పైకి రావడంతో రైతులు వాటికి మోటర్లు అమర్చి తోడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఈ వానకాలంలో మోటర్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కాళేశ్వరం కాలువలకు కూడా రైతులు పైప్‌లైన్లు వేసి బీడుభూములను సాగులోకి తెస్తున్నారు. వ్యవసాయ బావి, బోర్లకు కొత్త మోటర్లు, వాటినుంచి పొలాలకు నీటినందించేందుకు పైప్‌ల కొనుగోలుతో వాటి దుకాణాలు కళకళలాడుతున్నాయి. 


పట్నం నుంచి పొలం వైపు

కరోనా నేపథ్యంలో పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వెళ్లినవారి సంఖ్య భారీగా ఉన్నది. ఉద్యోగం చేసేవీలులేక కొందరు, ఉపాధి కరువై మరికొందరు పల్లెబాట పట్టారు. వీరిలో అధికశాతం మంది గ్రామాల్లో తమకున్న పొలాల సాగుపై దృష్టి సారించారు. ఏండ్లుగా పడావుగా ఉంచిన భూములను చదును చేయించి, వ్యవసాయం చేస్తున్నారు. సాగునీటి కోసం అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. కొత్తగా బోర్లు వేయించడం లేదా.. అప్పటికే ఉన్న బోర్లకు మోటర్లు బిగించడం, చెరువులు, కాలువ నుంచి పైప్‌లైన్లు వేయడం చేస్తున్నారు. నూతనంగా వ్యవసాయం ప్రారంభించే రైతు కనీసం రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయధారిత పరికరాల కోసం ఈ సీజన్‌లో రైతు సగటున రూ.50 వేలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కొందరు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని భారీగానే పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నారు.

వ్యాపారం రెట్టింపయింది: నిరంజన్‌, ఎలక్ట్రికల్‌ షాపు యజమాని

గతేడాదితో పోల్చితే ఈ సీజన్‌లో రెట్టింపుస్థాయిలో మోటర్లు, పైపులు విక్రయించాం. కరోనా సమయంలో అన్ని వ్యాపారాల మాదిరిగానే మా వ్యాపారం కూడా దెబ్బతింటుందని ఆందోళన చెందాం. కానీ విస్తారంగా వర్షాలు పడటం, కాళేశ్వరం నీళ్లు రావడంతో సాగు భారీగా పెరిగి.. మా వ్యాపారం కూడా అదేస్థాయిలో పెరిగింది. రైతులు ఎక్కువగా మోటర్లు, వైర్లు, పైపులు కొనుగోలు చేశారు. గతంలో నెలకు 10 మోటర్లు విక్రయిస్తే ఈ ఏడాది 20కి పైగానే విక్రయించాం.


logo