FIC | హైదరాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): ధాన్యం, బియ్యం ఉత్పత్తికి తెలంగాణ కేరాఫ్‌గా మారింది. దేశం యావత్తు ధాన్యం, బియ్యం కోసం పంజాబ్ తర్వాత తెలంగాణపైనే ఆధారపడుతున్నది. ఈ విషయాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) వెల్లడించింది. 2022-23 సంవత్సరానికి దేశవ్యాప్తంగా కేంద్రం కొనుగోలు చేసిన బియ్యం, ధాన్యంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ నుంచి రెండు సీజన్లలో కలిపి 131.86 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ఎఫ్‌సీఐ.. 88.35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది. దేశం మొత్తం మీద పంజాబ్ తర్వాత ఇదే అత్యధికం.
వాస్తవానికి ధాన్యం ఉత్పత్తిలో నిరుడు తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను దాటేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. పంజాబ్‌లో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. తెలంగాణలో సుమారు 30-40% ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తారు. వీటికి తోడు రైతులు తమ ఆహార అవసరాల కోసం కొంత మేర నిల్వ ఉంచుకొంటారు. ఈ నేపథ్యంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కొనుగోలు అంశంలో రెండో స్థానంలో నిలిచింది. నిరుడు తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగు నమోదైంది. వానకాలంలో 64.54 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో సాగైంది. మొత్తంగా 2022-23లో 1.21 కోట్ల ఎకరాల్లో సాగైంది. ఈ లెక్కన తెలంగాణలో సుమారు మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. పంజాబ్‌లో ఇది సుమారు 2 కోట్ల టన్నులకు పరిమితమైనట్టు సమాచారం.
తెలంగాణ వ్యవసాయరంగానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష. ఆయన కష్ట ఫలితమే నేటి తెలంగాణ పంటల ఉత్పత్తి. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఇప్పటికే పంజాబ్‌ను వెనక్కి నెట్టి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కేంద్రం కొనుగోలు చేసే ధాన్యం, బియ్యంలో రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యసాయ రంగంలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. -గంగుల కమలాకర్,
పౌరసరఫరాల శాఖ మంత్రి