కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హుజూరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీటిని కూడా ఎత్తిపోయకుండా గతానికి మించి పంటలు పండించామని గత సీజన్లో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది. ఈ నెల 3న ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలను ప్రారంభించిన 8 గంటల్లోనే పంపును నిలిపివేసింది. క్షేత్రస్థాయిలో సాగునీరు కావాలని రైతులు ఆందోళన చేస్తున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. నిరుడు వానలు పడి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసి గొప్పలు చెప్పుకున్నా ప్రభుత్వానికి ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం నుంచి ఎత్తిపోయడం ఒక్కటే మార్గంగా కనిపిస్తున్నా కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. మరో వారంలో వానలు పడకుంటే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. రైతులు భారీగా పెట్టుబడులను నష్టపోయే ముప్పు పొంచి ఉన్నది.
గంటలు నడుపకుండానే బ్రేక్
కాళేశ్వరం నీళ్లిచ్చి రైతులను అదుకోవాలని బీఆర్ఎస్ కొద్ది రోజులుగా సర్కారుపై ఒత్తిడి పెంచింది. ఆదివారం ఎల్లంపల్లి నుంచి సర్కా రు ఎత్తిపోతల ప్రక్రియ చేపట్టింది. ఎల్లంపల్లి నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఏడు పంపులు ఏర్పాటు చేసింది. ఒక్కో పంపు ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చర్యలు తీసుకున్నది. ఏడు పంపు ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేసింది. గతంలో ఆ మేరకు నీటిని కూడా ఎత్తిపోసింది. మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు, వరదకాలువ 122 కి.మీ పొడువునా నీటిని నింపింది. చెరువులు, కుంటలను మం డుటెండల్లోనూ మత్తడి దూకించింది. ప్రస్తుత సీజన్‌కు సాగునీటి కోసం రైతుల నుంచి డి మాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 3న ఎత్తిపోతల ప్రక్రియ చేపట్టింది. ఒక్క పంపునే ఆన్‌చేసి.. కేవలం 8 గంటలే నడిపించింది. కేవలం 0.1 టీఎంసీ నీటిని ఎత్తిపోసి నిలిపివేసిన తీరుపై రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
29 కిలోమీటర్లకే పరిమితం
ఎల్లంపల్లి నుంచి నీటిని మధ్యమానేరుకు తరలిస్తారని అందరూ భావించారు. కానీ, సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ నెల 3న ఎత్తిపోసిన నీటిని వరదకాలువకే పరిమితం చేసింది. అదీ 29 కి.మీమేర కు మాత్రమే నిల్వ ఉండేలా చూసింది. నిజానికి వరదకాలువ మొత్తం పొడవు 122 కి.మీ కాగా, ఎల్లంపల్లి నుంచి గాయత్రీ పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసే నీరు వరదకాలువ 99.02 కి.మీ వద్ద కలుస్తాయి. ఇక్కడి నుంచి మధ్యమానేరు ప్రాజెక్టుకు నీళ్లు వెళ్లాలంటే.. 102వ కి.మీ వద్ద ఏర్పాటు చేసిన క్రాస్ రెగ్యులరేటర్ (గేట్లు) ఎత్తాల్సి ఉంటుంది. వీటిని మూసివేస్తే ఎగువకు ఎస్సారెస్పీ వైపు నీళ్లు వెళ్తాయి. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద అప్పటి ప్రభుత్వం, గాయత్రీ పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసే నీటిని ఎస్సారెస్పీ వరకు తరలించేందుకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ (వరద కాలువ 73వ కి.మీ) వద్ద మొదటి పంపుహౌస్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావుపేట (వరద కాలువ 34 కి.మీ) వద్ద రెండో పంపుహౌస్, నిజామాబాద్ జిల్లా ము ప్కాల్ మండలం (0.10 కి.మీ) వద్ద మూడో పంపుహౌస్ ఏర్పాటు చేసింది. పునర్జీవ పథ కం కింద రోజుకో టీఎంసీ చొప్పున రెండు నెలల పాటు 60 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీకి ఎత్తిపోయాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసింది. ఇన్ని సౌకర్యాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 3న కేవలం 8 గంటలే పంపు నడిపింది. 102వ కి.మీనుంచి 73వ కి.మీ వరకే మీటర్ ఎత్తున నిల్వ ఉండేలా ఎత్తిపోసి చేతులు దులుపుకొన్నది.
మేడిగడ్డతో సంబంధం లేకున్నా
ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా మోటర్లు ఆన్‌చేసి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చని అధికారులు, సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. కానీ, ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తే కేసీఆర్‌కు పేరొస్తుందన్న ఉద్దేశంతో సర్కారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకపోవడం ఒకెత్తయితే ఎల్లంపల్లికి ఇన్ ఫ్లో లేకపోవడం మరో ఎత్తు. ఈ పరిస్థితుల్లో ఎగువన ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నా యి. మధ్యమానేరు సామర్థ్యం 27.55 టీఎంసీలుకాగా ప్రస్తుతం 7 టీఎంసీలే ఉన్నాయి. లోయర్‌మానేరు డ్యాం సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా 6 టీఎంసీలే ఉన్నాయి. అన్నపూర్ణ, ఎగువమానేరులోనూ నీరు అడుగంటిపోయాయి. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఇన్‌ఫ్లో భారీగా తగ్గింది. దీనివల్ల ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా ప్రాజెక్టులకు నీళ్లు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఎగువన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటి పోయి సాగునీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలాచోట్ల రెండోసారి నారు పోసినా నీళ్లు లేక రైతులు నష్టపోయారు. పలు చోట్ల నాట్లు వేసినా పొలాలు నెర్రెలు బారుతున్నాయి.
కాళేశ్వరమే శరణ్యం
నిరుడు వానలు విస్తరంగా పడటం వల్ల ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే వీలు కలిగింది. కానీ, తాజా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలే శరణ్యమన్న పరిస్థితి ఉన్నది. ఎల్లంపల్లి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12 టీఎంసీల నీరే నిల్వ ఉన్నది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని పంపాలంటే 9 టీఎంసీల వరకు ప్రాజెక్టులో ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో వచ్చే ప్రధాన సోర్సులైన కడెం, గోదావరి నుంచి వరద రావడం లేదు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిల్‌గా ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లి నిండే పరిస్థితి కనిపించడం లేదు. తాజా పరిస్థితులను నిశితంగా చూస్తే ఎల్లంపల్లి నుంచి ఎగువకు ఒకటి, రెండు టీఎంసీలకన్నా ఎత్తిపోసే పరిస్థితుల్లేవు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 1.40 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. ఈ నీరంతా నిత్య సముద్రం పాలవుతున్నది.
నీళ్లు రాలే.. నారే వేయలే
కాలువ పక్కనే నాకు వ్యవసాయ బావి ఉన్నది. ఈ సారి నీళ్లు రాక ఎండిపోయింది. నాట్లు వేయకపోవడంతో పోసిన నారు ముదిరిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మొగులు వైపు జూడలే. వర్షం రాని రాకపోని నీళ్లు వస్తయన్న భరోసా ఉండే. ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చినట్టు అయింది. నారు పోసిన పైసలు పాయే. వరి పంట వేయకపోతిమి. మా కుటుంబం ఎట్ల బతుకాలే. ఎట్ల తినాలే. నాకు నాలుగు ఎకరాలుంది. ఒక్క గుంట కూడ నాటు వేయలే. మేం ఏం అడుగుతున్నం? ఇంత నీళ్లు ఇవ్వమనేగదా? గా మాత్రం జెయ్యకపోతే ఇంకెందుకు? – మొగిలి, రైతు (హుజూరాబాద్ మండలం)