హుజూర్నగర్, ఫిబ్రవరి 3 : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌లో నిరసన సెగ తగిలింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద ఎన్నో ఏండ్లుగా ఇండ్లు లేని నిరుపేదలు నివాస గృహాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్‌రెడ్డి మంత్రి కావడం, ఎన్నికల ముందు న్యాయవాదులకు ఆయన హామీ ఇవ్వడంతో ఆ హామీ మేరకు మంత్రి ఉత్తమ్ ఫణిగిరిగుట్ట వద్ద ఉన్న మూడున్నర ఎకరాలను కోర్టు నిర్మాణానికి కేటాయించారు. ఆ స్థలంలో నిరుపేదల ఇండ్లు ఉన్నాయి.
ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సోమవారం అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిర్వాసితులు మంత్రి ఉత్తమ్ ఫ్లెక్సీతో ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. కొన్నేండ్లుగా నివాసముంటున్న తమను కాదని, కోర్టుకు స్థలం కేటాయించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇండ్ల పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు.