జనగామ చౌరస్తా, నవంబర్ 3 : బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్‌తో (Revanth Reddy) పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గానుగుపహాడ్, చీటకోడూరు గ్రామాల్లో బ్రిడ్జిలు నిర్మించాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు సాధన సమితి ఆధ్వర్యంలో పలుమార్లు వినతిపత్రం అందించారు.
అయినా కాంగ్రెస్ సర్కారు స్పందించకపోవడంతో సీఎం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చిత్రపటాలను గాడిదకు అతికించి అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న గ్రామస్థులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శ్రీర్షాసనం వేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.