మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’లో జనాలను ఎవ్వరినీ ఆమె దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర పోలీసుల నిర్బంధంలో సాగింది. భారీ బందోబస్తు మధ్య పాదయాత్రలో మీనాక్షి నడుస్తూ వస్తుంటే పోలీసులు రోప్(కంచె) వేశారు. జనాలను ఆ రోప్ అవతలే 20 ఫీట్ల దూరంలోనే నిలిపివేశారు.
ఈ యాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ రైతులు, రైతు కూలీలు, విద్యార్థి సంఘాలు, సాధారణ ప్రజలు, మహిళలు, క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతారని, వారితో మాట్లాడి పాలనపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారని భావించారు. కానీ ఎవ్వరితో సంబంధం లేదన్నట్టు హడావుడిగా యాత్ర సాగింది. దీంతో 18 నెలల పాలనపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్న యాత్ర ఉద్దేశమే పక్కదారి పట్టినట్టు అనిపించింది. మీనాక్షి నటరాజన్‌తో మాట్లాడుదామని, బాధలు చెప్పుకుందామని రోడ్లపైకి వచ్చిన జనాలు, కార్యకర్తలకు ఛాన్సే దొరకలేదు. ఖానాపూర్‌లో రెండు రోజులు అనుకున్న కార్యక్రమాన్ని ఒక్క రోజుకే కుదించారు. బాదన్‌కుర్తిలో యాత్ర మొదలై ఖానాపూర్‌లో ముగిసే దాకా పోలీసుల పహారాను దాటి మీనాక్షి బయటికి రాలేదు.
మీనాక్షి పాదయాత్ర సీఎం రేవంత్‌రెడ్డికి ఎంత మాత్రం ఇష్టం లేదనే ప్రచారాన్ని తగ్గట్టే యాత్ర మొత్తం టీపీసీసీ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథి అయినప్పటికీ పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రాధాన్యంగా యాత్ర సాగింది. మీనాక్షిని జనాలను కలవనివ్వకపోగా, ఎక్కడా ఎవ్వరితోనూ మాట్లాడనివ్వలేదు. మస్కాపూర్‌లో ఆదివాసీల దగ్గర ఒక్క క్షణం ఆగి, పొటోదిగి వెళ్లిపోయారు.
పాదయాత్రను హడావుడిగా ముగించడంపై జనాలు అసహనం వ్యక్తంచేశారు. షెడ్యూల్‌ను అనుసరించి బాదన్‌కుర్తి నుంచి ఖానాపూర్ వరకు 10 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని అనుకున్నారు. కానీ బాదన్‌కుర్తి శివాలయంలో పూజలు చేసి, స్థానిక బుద్ధ విగ్రహానికి పూలమాల వేసి నేరుగా సూర్జాపూర్కు వాహనాల్లో వచ్చారు. అక్కడి చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించి సాయంత్రం 5.45కు మస్కాపూర్ మీదుగా మూడు కిలోమీటర్లు దూరం నడిచి సాయంత్రం 6.30కి ఖానాపూర్ చేరుకున్నారు.
జనహిత పాదయాత్ర నేపథ్యంలో ఖానాపూర్ పట్టణం మొత్తాన్ని పోలీసుల బందోబస్తుతో నింపేశారు. పది మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, 22 మంది ఏఎస్ఐ- హెడ్ కానిస్టేబుళ్లు, 105 మంది కానిస్టేబుళ్లు, 30 మంది హోంగార్డులతో భారీగా పోలీసులను మోహరించారు. ఎస్సీ జనాకీషర్మిల, బైంసా ఏఎస్సీ అవినాశ్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షించారు.