ఖైరతాబాద్, ఫిబ్రవరి 12 : పీఆర్టీయూ ఎమ్మెల్సీ టికెట్ అమ్ముకున్నదని నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను ఆ రంగానికి చెందిన వారికి ఇస్తేనే విద్యారంగ సమస్యలపై గళమెత్తుతారని పేర్కొన్నారు. తాను గత 30 ఏండ్లుగా పీఆర్టీయూలో క్రియాశీలకపాత్ర పోషించానని, ఆరేండ్ల క్రితం ఆ సంఘం మద్దతుతో ఎమ్మెల్సీగా గెలుపొందినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డబ్బు ప్రలోభానికి గురై ఓ రియల్ఎస్టేట్ వ్యాపారికి పీఆర్టీయూ నుంచి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. ఉపాధ్యాయుడిగా ఉండి, ఆ సంఘంలో పనిచేసిన తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమయంలో తనకు పలు ఉపాధ్యాయ సంఘాలు, జూనియర్ లెక్చరర్స్ జేఏసీ మద్దతుగా నిలిచాయని, వారి మద్దతుతో తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై పోరాడే వారికి మద్దతు ఇవ్వాలని కోరారు.