మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 7 : మక్కలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాలో 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా మానుకోట, కేసముద్రంలోనే మక్కలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మానుకోటలో లక్షా 95వేల క్వింటాళ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తే, మార్క్ఫెడ్ ద్వారా 195 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారని వివరించారు. మార్కెట్లో మక్కలు అమ్మడానికి రైతులు వారం రోజుల వరకు పడిగాపులు ఉండాల్సి వస్తున్నదని తెలిపారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే అధికారులు మాత్రం 26 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం కలెక్టర్ స్నేహాశబరీష్ను కలిసి మక్క రైతుల సమస్యలపై వివరించి, మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరారు.