నమస్తేతెలంగాణ నెట్వర్క్, మార్చి 18 : విద్యారంగ సమస్యలతోపాటు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ర్యాలీలు, ఉద్యమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వీసీ చర్యలు తీసుకోవడంతో విద్యార్థిలోకం భగ్గుమన్నది. ఈ మేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ చలో అసెంబ్లీకి మంగళవారం పిలుపునివ్వగా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేశారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి పలువురు నాయకులు, విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, సంస్థాన్ నారాయణపురం, చండూరు, త్రిపురారం, నకిరేకల్, నార్కట్‌పల్లి, పాలకవీడు, నేరేడుచర్ల, పెన్‌పహాడ్, మోత్కూరు, ఆత్మకూర్.ఎం మోటకొండూరు, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాల్లో బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలుచోట్ల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.