గుమ్మడిదల, ఫిబ్రవరి 18: ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు మంగళవారం మరింత ఉద్రిక్తంగా కొనసాగాయి. మంగళవారం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ గ్రామస్థులు, రైతు జేఏసీ నాయకులు ట్రాక్టర్లపై ర్యాలీగా డంపింగ్‌యార్డు నిర్మాణం చోటుకు బయలుదేరారు. వారిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకున్నది. పోలీసులు బలవంతంగా వెనక్కి పంపడంతో బాధిత గ్రామాల ప్రజలు హైవేపై నిరసనకు దిగి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. డంపింగ్ యార్డు ఏర్పాటుపై రేవంత్ సర్కారు మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహిస్తూ గుమ్మడిదలలో జాతీయ రహదారి-765డీపై బతుకమ్మ ఆడిపాడి నిరసన తెలిపారు.
కాంగ్రెస్‌ది రాక్షస పాలన : శేరి
ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రాక్షస పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మండిపడ్డారు. అటుగా వెళ్తున్న ఆయన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నల్లవల్లి, ప్యారానగర్ గ్రామస్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత దుర్మార్గమైన పాలకులను ఎప్పుడూ చూడలేదని అన్నారు. కాగా గుమ్మడిదలలో కొనసాగుతున్న రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. మంగళవారం నాటి శిబిరంలో బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొని డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పచ్చని పల్లెల్లో డంపు యార్డా? : చుక్కరాములు
గుమ్మడిదలలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు సీపీఏం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాము లు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాంటూ ఈనెల 20న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దీక్ష చేపడతామని తెలిపారు.