కారేపల్లి, జూన్ 2 : అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని సోమవారం నిరసన వ్యక్తంచేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేరుపల్లి పంచాయతీ పరిధిలో అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న, సంపన్న కుటుంబాలకు ఇందిరమ్మ కమిటీలు ఇండ్ల జాబితాలో చోటు కల్పించారని ఆరోపించారు. ఉన్నతాధికారులు జాబితాను పరిశీలించి నిరుపేదలు, గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం ఉంటున్న వారికి ఇండ్లు మంజూరయ్యేలా చూడాలని కోరారు. నిబంధనలకు అనుగుణంగా ఇండ్లు మంజూరు చేయని పక్షంలో మండలపరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.