ఆదిలాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ)/బోథ్ : ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయి. పంట సేకరణ లక్ష్యం పూర్తయిందనే కారణంతో అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. రైతుల ఆందోళన ఫలితంగా సోమవారం నుంచి ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. దీంతో సోమవారం ఐదు గ్రామాలకు చెందిన 154 మంది రైతులు 3 వేల క్వింటాళ్ల పంటను తీసుకొచ్చారు. సోమవారం ఉదయం శాంపిళ్లు తీసుకెళ్లిన అధికారులు మధ్యాహ్నం నుంచి కొనగోలు చేస్తామని చెప్పారు. సాయంత్రం వరకు కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులో పడిగాపులు కాశారు. మంగళవారం ఉదయం రైతులు మార్కెట్ యార్డు ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్డీవో ఇతర అధికారులు వచ్చి రైతులతో మాట్లాడారు. నాణ్యత పరీక్షల తర్వాత కేవలం 11 మంది పంటనే కొనుగోలు చేస్తామని, మిగతా వారు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాలని సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తమ పంటలను అమ్మకొనేందుకు అరిగోస పడాల్సి వస్తున్నది. నాణ్యత లేదని అధికారులు కొర్రీలు పెట్టడంతో మూడు రోజులుగా ఎముకలు కొరికే 6.5 డిగ్రీల చలిలో మార్కెట్ యార్డులోనే పంటకు కాపలా ఉంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో సోయా రైతులు మంగళవారం రోడ్డెక్కారు. పంట కొనుగోలు చేయాలని నినాదాలు చేస్తూ బోథ్-నిర్మల్ రహదారిపై బైఠాయించారు. 4 గంటలపాటు రాస్తారోకో చేశారు. సోయా పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న సీఐ గురుస్వామి అక్కడికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నంచేశారు. మార్క్‌ఫెడ్ డీఎం, కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. తహసీల్దార్ సుభాశ్‌చందర్ జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవికి ఫోన్లో విషయాన్ని వివరించారు. మార్క్‌ఫెడ్ డీఎం, డీసీవోలు వచ్చి బుధవారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటారని జేసీ హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
నా పేరు నాగన్న. నేను 100 క్వింటాళ్ల సోయాబీన్ అమ్మేందుకు మూడురోజుల కిందట మార్కెట్‌కు తీసుకొచ్చా. తీరా పంట నాణ్యత లేదని ప్రైవేటులో అమ్ముకోవాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నరు. రైతులు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు బతికేది ఎట్లా?. పంట నాణ్యత లేదంటూ కొనుగోలు ఆపితే ప్రభుత్వాలు ఉండి ఏం లాభం.
-నాగన్న, రైతు, ఆర్లీ, ఆదిలాబాద్ రూరల్ మండలం
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్ఏక్యూ)ఉన్న మక్కజొన్న, సోయాబీన్ పంటల ఉత్పత్తులనే కొనుగోలు చేస్తున్నట్టు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వర్షాలతో తడిసి రంగుమారిన సోయాబీన్ కొనుగోలుకు నాఫెడ్ తిరస్కరిస్తున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోయాబీన్ పంటను కేంద్రమే కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఆదిలాబాద్‌లో వర్షాలతో సోయా పంట దెబ్బతినడంతో నిబంధనలకు అనుగుణంగా లేదని, దీంతో కొనుగోలుకు నాఫెడ్ తిరస్కరిస్తున్నదని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 3.56 లక్షల టన్నుల మక్కజొన్న కొనుగోలు చేసినట్టు తెలిపారు.