నర్సంపేట, మే 2: మక్కల కొనుగోలు కేంద్రాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని గురిజాల క్రాస్‌రోడ్డు వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలు కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ మాత్రం మండలానికి ఐదారు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో కాంటాలు సరిగా కావడంలేదని మండిపడ్డారు. నర్సంపేట డివిజన్లో 90 వేల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తే కేవలం ఏడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలను పెంచకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కాంటా కోసం పది రోజులుగా నిరీక్షణతీగరాజుపల్లిలో మక్క రైతుల రాస్తారోకో

సంగెం, మే 2 : మక్కలు కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి శివారులోని భాగ్యనగర్ వేబ్రిడ్జి వద్ద వరంగల్-మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పర్వతగిరి మండలం చౌటపల్లి, ఏనుగల్లు సొసైటీల ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంగెం మండలం ఏనుగల్లు, రోల్లకల్లు, వడ్లకొండ, పర్వతగిరి, చౌటపల్లి, చింతనెక్కొండ, సోమారంతోపాటు గిరిజన తండాల రైతులు మక్కలను వాహనాల్లో తీసుకొచ్చారు. కొంకపాక గోదాముకు వెళ్లాలని అధికారులు చెప్పడంతో సంగెం మండ లం తీగరాజుపల్లి సమీపంలోని భాగ్యనగర్‌లో వేబ్రిడ్జి వద్ద కాంటా వేయించుకునేందుకు పది రోజుల క్రితం ట్రాక్టర్లలో వచ్చారు. అయినా కొనుగోలు లేకపోవడంతో రాస్తారోకో చేపట్టగా పోలీసులు వచ్చి సొసైటీ నిర్వాహకులు, వేబ్రిడ్జివారితో మాట్లాడారు. హమాలీలను తీసుకొస్తామని ఎస్సై వంశీకృష్ణ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
మల్లంపల్లిలో మక్క రైతుల రాస్తారోకో

మల్లంపల్లి, మే 2 : మక్కజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా మల్లంపల్లిలోని హైవేపై శనివారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో వరంగల్, ములుగు వైపు వెళ్లే వాహనాలు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. పోలీసులు రైతుల వద్దకొచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు విన్పించుకోలేదు. వ్యవసాయ శాఖ అధికారులతోపాటు అదనపు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడించిన అనంతరం రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రైతులు ములుగుకు చేరుకొని అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గోవింద్‌నాయక్ మాట్లాడుతూ పండించిన పంటను అమ్ముకోలేక రైతులు రోడ్డెక్కినా మంత్రి సీతక్క స్పందించడం లేదని విమర్శించారు. మక్కజొన్న రైతులను మార్క్‌ఫెడ్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు మక్కలను కొనుగోలు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క స్పందించి మక్కల కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంటలను ఇంకెప్పుడు కొంటరు?

ఆదిలాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): యాసంగిలో సాగు చేసిన పంటలను ఇంకెప్పుడు కొంటారని మాజీ మంత్రి జోగు రామన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొబ్బాయిలో రైతులతో కలిసి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. యాసంగిలో పండించిన మక్క, శనగ, జొన్న పంటల కొనుగోలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులు నడ్డివిరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయరంగంలో అవలంబిస్తున్న విధానాలు అన్నదాతల పాలిటశాపంగా మారినట్టు తెలిపారు. జైనథ్ మండలం మాండగడ వద్ద మండుటెండను లెక్క చేయకుండా రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో మహారాష్ట్ర, ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శనగ, జొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మక్కలు కొనుగోలు చేయాల్సిందే ; తెలంగాణ రైతు సంఘం నేతల డిమాండ్

తల్లాడ, మే 2: మక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా నాయకుడు శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రైతు సమస్యలపై ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా మంత్రులు, అధికారుల్లో చలనం లేదని ధ్వజమెత్తారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.