చెన్నూర్ రూరల్, మే 14: ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారులు జాప్యం చేస్తున్నారని, అదీగాక తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాలు సన్నవడ్లకు 16 కిలోలు, దొడ్డు వడ్లకు 6 కిలోల చొప్పున కోత విధిస్తున్నారంటూ బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట వద్ద రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి 20 రోజులైనా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు 12 నుంచి 16 కిలోల వరకు కటింగ్ చేస్తున్నారని, ఇదెక్కడి దోపిడీ అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలన్నీ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉండటంతో ఇష్టారాజ్యంగా నడుస్తున్నదని విమర్శించారు. అధికారులు కూడా వాళ్లకే అనుకూలంగా ఉంటున్నారని ఆరోపించారు.
మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసిపోయిందని వాపోయారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. చెన్నూర్ సీఐ దేవేందర్ అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరినా వినలేదు. దీంతో రైతులు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో గ్రామానికి చెందిన కౌలు రైతు, బీజేపీ నాయకుడు బుర్ర రాజశేఖర్‌గౌడ్ చొక్కా చినిగిపోయింది.
సీఐ దేవేందర్ సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం రైతులు సీఐ దేవేందర్తోపాటు ఏడీఏ బానోత్ ప్రసాద్‌ను ధాన్యం కుప్పల వద్దకు తీసుకువెళ్లి తడిసిన ధాన్యాన్ని చూపించారు. ఏడీఏ అదనపు కలెక్టర్‌కు ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని, సన్నవడ్లను కటింగ్ లేకుండా కొనాలని నిర్వాహకులను అదనపు కలెక్టర్ ఆదేశించడంతో రైతులు శాంతించారు.
రావికంపాడు వద్ద రైతుల ఆందోళన
తరుగు పేరుతో మిల్లర్లు దోపిడీ చేస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రావికంపాడు కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. పది రోజుల క్రితం కాంటా వేసిన ధాన్యం నుంచి మిల్లర్లు క్వింటాకు 5 నుంచి 7 కిలోల వరకు తరుగు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నేటికీ ధాన్యం తరలించకపోవడంపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. మిల్లర్ల దోపిడీపై అధికారులకు తెలిపినా సొసైటీ సిబ్బంది, అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్ల తమకు న్యాయం జరగడంలేదని వాపోయారు.