మల్లాపూర్, మే 15: అటవీశాఖ భూమిని కొందరు ఆదరాబాదరగా సర్వే చేయించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ భూమిని కాపాడాలని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 49లోని 1.10 ఎకరాల భూమిలో 20 ఏండ్లుగా వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మొక్కలు పెంచుతున్నారని తెలిపారు.
ఈ భూమిపై కన్నేసిన కొందరు కబ్జాదారులు చుట్టు పక్కల భూములు గల రైతులకు చెప్పకుండా సర్వేచేయించారని చెప్పారు. అధికారులు సక్రమంగా సర్వే చేసి ఈ భూమిని రక్షించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసినట్టు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వీర్‌సింగ్ గ్రామస్థులతో మాట్లాడి 15 రోజుల్లో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.