వికారాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డికి ఓట్లేసి తప్పుచేసినమని ఆయన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు చెందిన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆసరా పింఛన్లు పెంచుతామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడంతో వారు భగ్గుమంటున్నారు. నిన్న, మొన్నటి వరకు నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేసిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి సీఎం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా టేకులగూడకి చెందిన మహిళలు, వృద్ధులు రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘ఓట్ల కోసం అప్పుడు మా కాళ్లు పట్టుకున్నావ్.. ఇప్పుడు పింఛన్లు పెంచాలంటే రాళ్లు పట్టుకుంటున్నావ్’ అని మండిపడ్డారు. కొత్త పింఛన్ల ఇస్తామని, ఉన్న పింఛన్లను పెంచుతామని హామీనిచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకుంటలేరని ఆరోపించారు. కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, లేకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.