చిక్కడపల్లి, సెప్టెంబర్ 28: ‘బతుకమ్మ నువ్వే మమ్మల్ని బతికించు’ అంటూ నిరుద్యోగులు వేడుకొన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌తో ఆదివారం అశోక్‌నగర్ సమీపంలో నిరుద్యోగులు బతుకమ్మ (Bathukamma) అడుతూ వినుత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.
నిరుద్యోగల వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగభృతి నెలకు రూ.4వేలు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బతుమ్మను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి బయలుదేరిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరుద్యోగులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని నిరుద్యోగులు మండిపడ్డారు. బతమ్మను నిమజ్జనం చేయకుండా అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. అశోక్‌నగర్‌లోని హుస్సేన్‌సాగర్ నాలాలో బతుకమ్మను నిమజ్జనం చేశారు.