నాగర్ కర్నూల్ : కల్యాణలక్ష్మి ( Kalyana Lakshmi ) , షాదీ ముబారక్ ( Shaadi Mubarak ) పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనర్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) ఆధ్వర్యంలో గురువారం మహా ధర్నా, భారీ ర్యాలీ నిర్వహించారు.

మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డ బరువు కావద్దనే ఉద్దేశం తో ప్రవేశపెట్టిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి పథకానికి తోడుగా కొత్త జంటలకు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నెరవేర్చకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని. ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చేందుకు కేవలం ఐదు మంది మాత్రమే వెళ్లాలంటూ పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలకు , పోలీసులకు తోపులాట జరిగింది. ఈ క్రమంలో స్థానిక సీఐ అశోక్ రెడ్డికి మర్రి జనార్దన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కాకి చొక్కా వేసుకుని కాంగ్రెస్ కార్యకర్తల మాదిరి పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.