చిన్నశంకరంపేట, నవంబర్ 11: పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వివిధ పార్టీల నాయకులు ఆరోపించారు. సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పరిధి గవ్వలపల్లి చౌరస్తాలో మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులతో కలిసి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి నెల రోజులు గడుస్తున్నా నిర్వాహకులు ధాన్యాన్ని తూకం వేయడం లేదని ఆరోపించారు. కొన్ని కేంద్రాల్లో సన్నరకం ధాన్యం తూకం ప్రారంభం కాలేదని, సన్నాలకు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోతే ప్రభుత్వం కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. గంటపాటు నిరసన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.