Station Ghanpur | వరంగల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జనగామ చౌరస్తా: ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ పేరిట జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిరసన సెగ తలిగింది. మహిళా కళాకారులు తమ డిమాండ్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సాంస్కృతిక సారథిలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని గుర్తుచేశారు. ఆ ఫ్లెక్సీని చూసిన రేవంత్‌రెడ్డి అసహనానికి గురయ్యారు. ఫ్లెక్సీని చూశానని, ఇక దించాలని ఆదేశించారు. కళాకారులు కూర్చునేలోపు ఒక్కసారిగా పదుల సంఖ్యలో పోలీసులు వారిని చుట్టుముట్టారు. దీంతో సభలో ఒకసారిగా గందరగోళం నెలకొన్నది. మహిళా కళాకారుల ఫోన్లు, ఫ్లెక్సీని పోలీసులు గుంజుకున్నారు. వారిని ఈడ్చుకుంటూ సభ నుంచి బయటికి తీసుకువెళ్లారు. కొందరు చంటి బిడ్డలతో రాగా.. ముఖ్యమంత్రి మెప్పు కోసం పోలీసులు వారితోనూ దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకు ప్రయత్నిస్తే అమానుషంగా ప్రవర్తించారని కళాకారులు వాపోయారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసలు కాంగ్రెస్ నేతల దూరం
బీఆర్ఎస్ తరఫున గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మద్దతుగా రేవంత్‌రెడ్డి ఈ సభలో ప్రసంగించారు. స్టేషన్ ఘన్పూర్ ప్రజలు కడియం శ్రీహరికి అండగా ఉండాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవుతుందనే చర్చ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి విన్నపం ఉపఎన్నికలకు సంకేతమని సభకు వచ్చినవారు మాట్లాడుకున్నారు. ఈ సభకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సింగారపు ఇందిర హాజరుకాలేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న పదేండ్లు పార్టీ కోసం పనిచేసిన ఆమె ఈ సభకు దూరంగా ఉండటంపై కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. కడియం శ్రీహరి వచ్చిన తర్వాత మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారిని ఇబ్బంది పెడుతున్నారని ఇందిర ఇప్పటికే పీసీసీ, ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభకు ఇందిర దూరంగా ఉండడంతో మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న ఓ వర్గం సైతం సభకు రాలేదు.
ఘన్‌పూర్‌లో సీఎంకు నిరసన సెగ..
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆదివారం జరిగిన బహిరంగసభలో రేవంత్‌కు నిరసన తెలిపిన మహిళా కళాకారులను ఈడ్చుకుపోతున్న పోలీసులు
పిల్లలతో డ్యాన్సులు..
ఈ సభలో ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే, సీనియర్ ఐఏఎస్‌లు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాఠశాల పిల్లలతో స్టేజీపై ర్యాప్ సాంగ్‌లకు డ్యాన్సులు వేయించడంపై విమర్శలు వస్తున్నాయి. మొదట సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించగా.. ఆ తర్వాత ఎండలోనూ చిన్న పిల్లలతో నృత్యం చేయించడంతో సభకు హాజరైనవారు ఆశ్చర్యపోయారు. అనంతరం పిల్లలతో ఏకంగా ర్యాప్ సాంగ్‌లకు డ్యాన్సులు చేయించారు. దాదాపు పదేండ్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ సభలో చిన్న పిల్లలతో ఇలాంటి డ్యాన్సులు వేయించడంపై సభకు వచ్చినవారు, ముఖ్యంగా మహిళలు పెదవి విరిచారు.
రేవంత్ అన్న ఏంది ఇది..
కాంగ్రెస్‌లో ఫిరాయించిన కడియం శ్రీహరి పరిస్థితి ఆయన సహజ వైఖరికి భిన్నంగా ఉన్నదని బహిరంగ సభకు వచ్చిన వారు చర్చించుకున్నారు. కడియం శ్రీహరి ప్రసంగంలో ప్రతిసారి ముఖ్యమంత్రిని రేవంత్‌రెడ్డి అన్న అని సంబోధించారు. కడియం శ్రీహరి కంటే దాదాపు 17 ఏండ్లు చిన్న వయస్సు ఉన్న రేవంత్‌రెడ్డిని గతంలో ఎప్పుడూ లేని విధంగా అన్న, అన్న.. అని అనడం కొత్తగా ఉన్నదని… ఉప ఎన్నికలు వస్తాయనే ఆందోళనే దీనికి కారణమై ఉంటుందని సభకు వచ్చినవారు ముచ్చటించుకున్నారు.
అక్రమ అరెస్ట్‌లు అప్రజాస్వామికం: ఎమ్మెల్యే పల్లా
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా జనగామ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని, అసమర్థ పాలనపై ప్రశ్నిస్తారనే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. సీఎం పర్యటన స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉంటే జనగామ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అక్రమ నిర్బంధాలతో నిరంకుశత్వాన్ని చాటుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు. ఈ మేరకు ఒక ప్రకటనలో పల్లా తెలిపారు. కాగా, జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
గులాబీలతో ఇబ్బంది..
స్టేషన్ ఘన్పూర్ పర్యటనలో భాగంగా బహిరంగ సభకు ముందు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రతి స్టాల్లోనూ నిర్వాహకులు ముఖ్యమంత్రికి ఆత్మీయంగా వారి ఉత్పత్తులతోపాటు గులాబీ పూలను ఇచ్చారు. దీంతో రేవంత్‌రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రంగు గులాబీ కావడంతో స్టాళ్లలో పూలు తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడినట్టు ఓ ఐఏఎస్ అధికారి పక్కనున్న వారితో అనడంతో అక్కడ ఉన్నవారు నవ్వుకున్నారు.
బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టు
సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్యను గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో పంటలు ఎండిపోవడంతో సీఎం రేవంత్‌పై ఆగ్రహంగా ఉన్న రైతులు, నేతలు నిరసనలు తెలిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సూచనల మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి పోలీసులు అరెస్టులు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు బీజేపీ, సీపీఎం, టీడీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. వారిని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీఎం సభ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు విడిచిపెట్టారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని మంత్రి రాజయ్య విమర్శించారు.