బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 21:41:35

ధరణి పోర్టల్‌తో ఆస్తులకు రక్షణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ధరణి పోర్టల్‌తో ఆస్తులకు రక్షణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

వివిధ కారణాలతో రిజస్టర్‌, రెగ్యులరైజ్‌ కాని ఆస్తులను గుర్తించి.. వాటికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలను తీసుకువచ్చిందని ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై సోమవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారని తెలిపారు. గతంలో ఎన్నో ఏళ్లుగా ఇండ్లలో నివసిస్తూ రిజిస్టర్ కానివి, గ్రామ కంఠంలో కట్టుకున్న ఇండ్లు, కొన్ని పట్టా భూముల్లో కట్టుకుని రిజిస్టర్ కానివి, ప్రస్తుతం అమ్ముకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

ముఖ్యంగా పేద వారికి ఇబ్బంది కలగకుండా, వారి అవసరాల నిమిత్తం అమ్ముకొనే వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. అందువల్ల ఆస్తుల  వివరాల సేకరణ విషయమై అధికారులు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచి చేసేందుకు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూతగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రెవెన్యూ చట్టాన్ని తెచ్చారని తెలిపారు. వ్యవసాయ,  వ్యవసాయేతర భూములకు పట్టా పాస్ బుక్కులను ఇవ్వనున్నారని అన్నారు.

గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నప్పటికీ ప్రజలు పూర్తి సమాచారం అందించాలని, అది మీ భద్రకే అన్న విషయాన్ని మరచిపోవద్దని మంత్రి తెలిపారు. ప్రజలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచడం జరుగుతుందని, ఎవరైనా దళారీలు మోసం చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారి గుర్తించి తమకు సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆవాది, గ్రామకంఠం, అసైన్డ్ భూముల్లో కట్టుకున్న కూడా అలాంటి వివరాలను కూడా ఇవ్వాలని, అన్ని రకాల ఆస్తులను ధరణి పోర్టల్‌లో నమోదయ్యేలా చూడడం కోసం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అక్రమ లేఅవుట్ల రేగులరైజేషన్ కోసం ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేసుకోవాలని, అలాంటి ప్లాట్లు ఉన్నవారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని, భవిష్యత్తులో లాభం కలుగుతుందని ఆయన తెలిపారు.

జిల్లాలో మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీలను కలిపి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని, డివిటీపల్లి ప్రాంతంలో పరిశ్రమలు  వస్తున్నందున ఒక ప్లానింగ్ సిటీగా మహబూబ్‌నగర్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo