హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘ఇయ్యాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నోళ్లకు రాష్ర్టాన్ని అప్పగిస్తే.. రాష్ర్టాన్ని కూడా అమ్మరా? పార్టీ టికెట్లనే అమ్ముకునే నాయకులు రాష్ర్టాన్ని కాపాడుతరా? టికెట్లు అమ్ముకునే నాయకులు కావాలో.. నిత్యం ప్రజల కోసం ఆలోచించే బీఆర్ఎస్ నాయకులు కావా లో ప్రజలే ఆలోచించుకోవాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్‌కు ఓటే స్తే కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టయితదని, పైరవీకారులు, దళారుల రాజ్యం, లం చాల రాజ్యం వస్తదని హెచ్చరించారు. పొదరిల్లు తెలంగాణను మళ్లీ అడ్డమైన వాళ్ల చేతిలో పెడితే ఆగమాగమవుతుందని తెలిపారు. అం దుకే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిర్పూర్ కాగజ్‌నగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో బుధవారం ని ర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆకాంక్షల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని, పదేండ్ల పాలనలో అన్నిరంగాలను అభివృద్ధి చేశామని వివరించారు. గిరిజనులకు ఇప్పటికే పోడు పట్టాలు ఇచ్చామని, రాబోయే రోజుల్లో గిరిజనేతరులకు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మంచినీళ్లు, సాగునీళ్ల్లు, కరెంటు లేదని, రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, పరిశ్రమలు మూతపడుడు, ప్రజలు వలసపోవాల్సిన దుస్థితి ఉండేదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభు త్వం ఒక్కో రంగాన్ని బాగు చేసుకుంటూ ముం దుకు పోతున్నదని తెలిపారు. మంచినీళ్ల బాధ తీర్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా గోండు గూ డేలు, తండాలు, మారుమూల పల్లెల్లో కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టి శుద్ధమైన నీళ్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కరెంటును బాగుచేసుకున్నామని, వ్యవసాయం, పరిశ్రమలు, ఇండ్లకు ఇలా అన్ని రం గాలకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని ఉద్ఘాటించారు. పిం ఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను పెట్టామని వివరించారు. ఆరోగ్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామని, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు పెట్టి ప్రోత్సహిస్తే ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రైవేట్ దవాఖానల దోపిడీ తగ్గిపోయిందని వెల్లడించారు. పాఠశాల విద్యారంగం లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కలిపి మొత్తంగా 1,019 గురుకులాలను ఏర్పాటు చేశామని, ఆ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఒక్కొక్కరి మీద ఏటా రూ.1.25 లక్షలు ఖర్చుపెట్టి నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. రైతాంగం బాగుపడాలని, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని పలు పథకాలు పెట్టామని చెప్పారు. పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని రైతుబంధు అందిస్తున్నామని, దానిని పెంచుతామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ జమానాలో బ్యాంకు అధికారులు రైతుల ఇండ్ల తలుపులు ఎత్తుకెళ్తే. బీఆర్ఎస్ హయాంలో బ్యాంకుల వారే రైతుబంధు, రైతుబీమా డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారని పేర్కొన్నారు. ‘నేడు తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్‌గా ఉన్నది. ఇదంతా మంత్రం చేస్తే కాలేదు. పట్టుదల, దీక్షతో, ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్తే జరిగింది. కేసీఆర్ జగమొండి.. అనుకుంటే ఏదైనా చేస్తాడు. కాబట్టే అనుకున్నవన్నీ సకాలంలో పూర్తిచేశా’ అని తెలిపారు.
రాష్ట్రంలో హిందూ, ముస్లింలు సోదరభావంతో, వరుస పెట్టి పిలుచుకుంటూ జీవనం సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత పదేండ్లలో రాష్ట్రంలో ఒక్క కర్ఫ్యూ లేదని, అన్ని వర్గాలను కలుపుకొనిపోతున్నామని, ఇక ముందు అదేవిధానంలో కొనసాగుతుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో ముస్లింల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చుచేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చిందని వివరించారు. ముస్లింలపై కాంగ్రెస్ ప్రేమ ఎంతగొప్పదో ఖర్చు చేసిన నిధులతోనే తెలిసిపోతుందని, దీనిపై ముస్లింలు ఆలోచించాలని కోరా రు. దీపావళి, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరి ముఖంలో వెలుగులు నింపాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయమని, అందుకోసమే పాటుపడుతున్నామని పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ను ఆదరించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 93 లక్షల మంది రేషన్‌కార్డుదారులకు ఎన్నికల తరువాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని, రైతుబీమా తరహాలో బీమాను కూడా అందిస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పదేండ్ల పాలనలో ముస్లింల సంక్షేమానికి రూ.900 కోట్లు ఖర్చుచేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు వెచ్చింది. ముస్లింలపై కాంగ్రెస్ ప్రేమ ఎంతగొప్పదో ఖర్చు చేసిన నిధులతోనే తెలిసిపోతున్నది. దీపావళి, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణలోని ప్రతి ఒక్కరి ముఖంలో వెలుగులు నింపాలన్నదే బీఆర్ఎస్ ధ్యేయం. అందుకోసం పాటుపడుతున్నాం.
– సీఎం కేసీఆర్
మినీ ఇండియాలా ఉండే కాగజ్‌నగర్ కాం గ్రెస్ పాలనలో ఆ వైభవాన్ని కోల్పోయిందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అతి కొద్దిమంది గొప్ప ఎమ్మెల్యేల్లో కోనప్ప ఒకరని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటారని కొనియాడారు. తన వద్దకు ఎప్పుడూ వచ్చినా బ్రిడ్జిలు, కాలువలు, అభివృద్ధి కార్యక్రమాలు అడిగారే తప్ప, వ్యక్తిగత పనులను అడగలేదని చెప్పారు. కో నప్ప కాగజ్‌నగర్‌లో పేపర్ మిల్లును తెరిపించేందుకు ఎంతో తపన పడ్డారని, మంత్రి కేటీఆర్ వెంటపడి 10 కంపెనీలను సంప్రదించి చివరకు ఒక కంపెనీని పట్టుకొచ్చారని గుర్తుచేశారు. సర్ సిల్క్ కంపెనీని తెరిపించేందుకు కోనప్ప ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కోనప్పను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వేల ఎకరాలకు పోడుపట్టాలు ఇచ్చామని, పోడు కేసులను ఎత్తేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబంధు, రైతుబీమా కూడా ఇస్తున్నామని వెల్లడించారు. పోడుపట్టాలను అందుకున్న ఇద్దరు గిరిజనులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొ ప్పున రైతుబీమా ఇచ్చామని తెలిపారు. ‘ఇంకా పోడుపట్టాల పంపిణీ మిగిలి ఉంటే అది కూడా పూర్తవుతుంది. పోడుపట్టాలివ్వాలని గిరిజనేతరులు కూడా కోరుతున్నారు. వారికి కూడా ప ట్టాలు వచ్చే అవకాశమున్నది. అందుకు కేంద్ర ప్రభుత్వమే అడ్డంకిగా ఉన్నది. కఠిన నిబంధనలు పెట్టింది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని లెక్కలు తీశాం. ఎన్నికల తరువాత కేం ద్రంతో కోట్లాడి గిరిజనేతరులకు పోడుపట్టాలిప్పిస్తాం’ అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ‘బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్కాగజ్నగర్తోపాటు చాలా ప్రాంతాల్లో ఆరె, మాలి కులస్థులు ఉన్నారు. వారి అభివృద్ధికి పాటుపడతాం. ఆరె, మాలి కులస్థులు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలని అడుగుతున్నారు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేస్తాం. వారి సంక్షేమానికి కృషిచేస్తాం. మాలి కులస్తుల విషయంలో మేం ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. మాలి కులస్థులు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో ఉన్నారు. ప్రత్యేకంగా డబ్బులు వెచ్చించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తాం’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
134 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి నిర్వహణ చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 49 శా తం వాటాను కేంద్రానికి అప్పజెప్పిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఆ సంస్థ ఎప్పుడూ లాభాల బాట పట్టలేదని గుర్తుచేశారు. నేడు స్వరాష్ట్ర పాలనలో సింగరేణి లాభం రూ.2,200 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించారు. ఈ దసరా, దీపావళికి కలిపి కార్మికులకు రూ.వెయ్యి కోట్లు పంచామని వెల్లడించారు. నాటి కాంగ్రెస్, వామపక్ష యూనియన్లు డిపెండెంట్ ఉద్యోగాలను పీకిపారేస్తే, బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించామని చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లా కావడంతో మన్యం బిడ్డలకు మంచి రోజులు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే ఆసిఫాబాద్ జిల్లా కాకపోయేదని తెలిపారు. ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీతోపాటు వందల పడకలుండే మంచి దవాఖాన రావడంతో మన్యం బిడ్డలకు మంచి జరిగిందని తెలిపారు. జల్ జంగల్ జమీన్ నినాదమిచ్చిన మహాయోధుడు కుమ్రంభీం పేరుతో స్వయంగా తానే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అని నామకరణం చేశానని గుర్తుచేశారు. ‘ఒక్క ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనే 47 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చాం. మునపటి లాగా కల్తీనీళ్లు తాగి మరణాలు లేవు. గిరిజనులను అభివృద్ధి చేసుకొంటున్నాం. ఈ అభివృద్ధి ఇలాగే జరగాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్లీ రావాలి. కోవా లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు.
పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆ పార్టీకి చెందిన ఎంతో మంది నేతలు గాంధీభవన్ వద్ద ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. గాంధీభవన్ గేట్లకు తాళాలు వేసుకున్నారని తెలిపారు. ‘ఇయ్యాల టికెట్లు అమ్మినోళ్లకు రాష్ర్టాన్ని అప్పగిస్తే.. ఆ తర్వాత రాష్ర్టాన్ని అమ్మరా? టికెట్లు అమ్ముకునే నాయకులు కావాలో.. నిత్యం ప్రజల కోసం ఆలోచించే బీఆర్ఎస్ నాయకులు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి. డబ్బు సంచులు పట్టుకొని దిగి, నాలుగు రోజులు తమాషా చేసి, మోచేతికి బెల్లం పెట్టి, చాక్లెట్లు, పిప్పర్మెంట్లు ఇస్తారు. ఎన్నికలు కాగానే కనపడకుండా పోతారు. మనం మాత్రం మోసపోతం’ అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్ కోరారు.
బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ప్రజలందరికీ తెలుసని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, హక్కుల కోసం, ఆకాంక్షల కోసమే పుట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు. 14 ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించామని, ప్రజలందరూ ఆశీర్వదించి అవకాశమిస్తే గత పదేండ్లుగా పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. గతంలో 50 ఏండ్లు ఇక్కడ, ఢిల్లీలో కాంగ్రెస్‌కు అవకామిస్తే ఏం చేసిందో కూడా అందరికీ తెలుసని, కాంగ్రెస్ దోఖాబాజీ పార్టీ అని ధ్వజమెత్తారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి బలవంతంగా ఆంధ్రాలో కలిపారని, ఫలితంగా తెలంగాణ ఎంతో నష్టపోయిందని అన్నారు. 2004లో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని, అక్కడితో ఆగకుండా టీఆర్ఎస్నే చీల్చే ప్రయత్నం చేసిందని నిప్పులు చెరిగారు. చివరకు తాను ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పటికీ తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ కాంగ్రెస్ వెనక్కిపోయిందని, దీంతో యావత్ తెలంగాణ సమాజం మరోసారి ఉప్పెనలా కదలి పోరాటం చేస్తే ఇక తప్పదురా అని, గత్యంతరం లేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిందని వివరించారు.
ఏ పార్టీ ఏం చేసిందో ఆలోచించండి
ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలే ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఇప్పటికీ రావాల్సినంతగా ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఎన్నికలు రావడం, పార్టీల తరఫున అభ్యర్థులు పోటీ చేయడం, అందులో ఎవరో ఒకరు గెలవడం సహజం. కానీ అభ్యర్థుల గుణగణాలతోపాటు అతని వెనకున్న పార్టీ చరిత్ర ఏమిటి? వైఖరి ఏమిటి? అధికారమిస్తే ఏం చేస్తారు? ఎవరి మంచికోరుతారు? ఎవరి కోసం తాపత్రయపడుతారు? బీసీలు, మైనార్టీలు, గిరిజనులకు ఏం చేస్తారు? అనేది ముఖ్యం. మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది.
– సీఎం కేసీఆర్
రైతుబంధు పేరిట నిధులు దుబారా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రైతుబంధు దుబారా నా? కాదా? అనేది ప్రజలే నిర్ణయించాలని కోరారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారని.. కరెంటు 24 గం టలు కావాలా? 3 గంటలు కావాలా? మళ్లీ చీకటి రాజ్యం రావాలా? అనేది తేల్చు కోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎ ప్పుడూ కరెంటు ఇవ్వలేదని, నేడు తా ము ఇస్తుంటే అడ్డంపడుతున్నదని విమర్శించారు. ధరణి వచ్చాక ఎవరి భూమి వారికి ఉన్నదని, నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయని చెప్పారు. రా హుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతలందరూ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారని మండిపడ్డారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు.
డబ్బు కట్టులతో వచ్చే కాంగ్రెస్ నేతలను నమ్మొద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతదా? అని ప్రశ్నించారు. బెల్లంపల్లి ప్రజలు తెలివైన వారని, నిత్యం ప్రజల్లో ఉండే చిన్నయ్యను గెలిపించాలని కోరారు. నలుగురు తలమాసినోళ్లు అమ్ముడు పోయినంత మాత్రాన మనకేమీ ఫరక్ పడదని, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే బాసులని స్పష్టంచేశారు. దుర్గం చిన్నయ్య చాలా మంచి వ్యక్తి అని, ఆయన వెనకున్న పార్టీని చూసి బెల్లంపల్లి ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నయ్య అడిగిన ఇంజినీరింగ్ కాలేజీ, గురుకులాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలో 10 వేలమందికి ఇండ్ల పట్టాలిచ్చామని, మిగిలినవారికి కూడా ఇస్తామని చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా చిన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.