JNTU | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ కూకట్పల్లి క్యాంపస్‌లో ప్రొఫెసర్లు క్లాసులు చెబుతుంటారు.. ఇవే పాఠాలను జేఎన్టీయూ వనపర్తిలోని విద్యార్థులు ఎంచక్కా వినొచ్చు. వనపర్తి జేఎన్టీయూయే కాకుండా సిరిసిల్ల, మహబూబాబాద్, పాలేరు జేఎన్‌టీయూల్లోని విద్యార్థులంతా ఈ పాఠాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని జేఎన్టీయూ అతి త్వరలో కల్పించనున్నది. ఇటీవలీ కాలంలో జేఎన్టీయూకు అనుబంధంగా వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌లో కొత్త ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరుచేశారు.
వీటిల్లో అంతంత మాత్రంగానే విద్యార్థులు చేరారు. అయితే ఇవి కొత్త కాలేజీలు కావడంతో కొన్నింటిలో ఫ్యాకల్టీ కొరత సమస్య వేధిస్తున్నది. దీంతో క్లాసులు సవ్యంగా సాగడంలేదు. సమస్యను తీర్చేందుకు వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు వర్సిటీలోని స్టూడియో సేవలను వినియోగించుకోనున్నారు.
గతంలో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి జేఎన్టీయూలో స్టూడియోను నిర్మించారు. అధునాతన కెమెరాలు కొనుగోలు చేశారు. కానీ ఇవన్నీ నిరూపయోగంగా మారాయి. తాజాగా జేఎన్టీయూ కూకట్‌పల్లిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. ఆచార్యులు చెప్పే క్లాసులను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేస్తారు. విద్యార్థులు ఆన్లైన్లో సందేహాలను నివృత్తిచేసుకోవచ్చని ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫేక్ ఫ్యాకల్టీని అరికట్టేందుకు ఫ్యాకల్టీ ఫొటోలను కాలేజీల్లో ప్రదర్శించే యోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ విధానం కొన్ని కాలేజీల్లో అమలవుతున్నదని, అన్ని కాలేజీల్లోని ఫ్యాకల్టీ ఫొటోలను ప్రదర్శించాలని ఆదేశాలిస్తామని తెలిపారు.