జనాభా వివరాలు అసమగ్రంగా ఉన్నాయన్న వాదనలపై మీ అభిప్రాయం? కులగణన గణాంకాలు చూస్తే సర్వే అసమగ్రంగా జరిగినట్టు స్పష్టమవుతున్నది. ఓసీల సంఖ్యను 16 లక్షలకు పెంచి, బీసీల సంఖ్యను 22 లక్షలు తగ్గించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై బీసీలు తిరగబడుతున్నారు. దీంతో తమ జనాభా 10 శాతం కాదని 15 శాతం ఉన్నామని చెప్పడానికి ఏకపక్షంగా జనాభాను పెంచి చూపిస్తున్నారు.
Professor Simhadri | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వేను సమగ్రంగా చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సింహాద్రి పేర్కొన్నారు. బీసీల సంఖ్య పెరిగితే వారు తమకు దక్కాల్సిన వాటా అడుగుతారనే భయంతో వారిని ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని మండిపడ్డారు. కులాల లెక్కలు చెప్తే వారిలో రాజకీయ చైతన్యం పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారి వివరాలను వెల్లడించలేదని చెప్పారు. సమన్వయ లోపం, పాలనలో డొల్లతనంతో ప్రభుత్వం తన నైతికతను కోల్పోయిందని విమర్శించారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కులగణన సర్వేలో లోపాలను ఆయన ఎత్తిచూపారు.
సింహాద్రి: కులగణనతో సామాజిక న్యాయం సాధ్యమని రాజ్యంగం స్పష్టం చేస్తున్నది. ‘కులగణన’పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. 2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే, కాంగ్రెస్ చేసిన కులగణన డాటా మన ముందున్నది. అయితే ఆనాడు 51 శాతం ఉన్న బీసీ జనాభాను 46 శాతానికి తగ్గించి చూయించడం దారుణం. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు బీసీ వ్యతిరేకత స్పష్టంగా బయటపడింది. రాహుల్ గాంధీ కులగణనపై చెప్తున్న లక్ష్యాలకు విరుద్ధంగా సర్వే జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు మొదటి నుంచి కులగణనకు సుముఖంగా లేరు. తాజా సర్వేలో బీసీల జనాభాను 22 లక్షలు తగ్గించారు. వీరితోపాటు ఎస్సీల జనాభాను తగ్గించి చూపారు. బీసీల లెక్కను సమగ్రంగా అడ్రస్ చేయడంలో ప్రభుత్వం విఫలం అయింది.
ఈ కులగణన సర్వేలో ప్రభుత్వం ప్రాథమిక సమాచారాన్ని చూపింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో పూర్తి రిపోర్టు పెట్టాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కులాల వారీగా వారి విద్య, నిరక్షరాస్యత, ఉద్యోగభద్రత, ఇండ్లు, కులవృత్తుల పరిస్థితి, ఆదాయం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు (బీపీఎల్), మధ్యతరగతి కుటుంబాలు, ఆయా కులాల వారికి ఉన్న భూములు, సంపద, మౌలికవసతులు వంటి 56 పారామీటర్ల డాటాను ప్రభుత్వం సమగ్రంగా అసెంబ్లీ ముందు ఉంచాలి. వీటన్నింటిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం వద్ద సమగ్ర ప్రణాళిక లేదని తేలిపోయింది. కులగణనపై ప్రాథమిక లెక్కలు వెల్లడించి ఏదో సాధించాం అని చెప్పడం ఏంటి? తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీనే తప్పుదోవ పట్టించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సర్వేతో ప్రభుత్వం డొల్లతనం, నిబద్ధత ఏ పాటిదో తేలిపోయింది. సమగ్రమైన లెక్కలు ప్రజల ముందు ఉంచితే ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగేది.
ఉద్దేశపూర్వకంగా జనాభాను పెంచుకున్నారనే అంశంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సర్వే రిపోర్టును బీసీలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీసీలు సిద్ధమవుతున్నారు.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఈ కులగణన ప్రభావం ఏమైనా ఉంటుందా..?
కులగణనకు సీట్ల పెంపుదలకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం 2025లోనే జనగణన చేస్తామంటున్నది. అయితే ఉత్తర భారతంలో జనాభా సంఖ్య గణనీయంగా పెరిగింది. వారితో పోలిస్తే దక్షిణాదిలో జనాభా శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఉత్తరాది జనాభా పెరిగితే వారికి సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి వారి ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కులగణన లోపాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విస్తృతంగా క్యాంపెయినింగ్ చేపడతాం. ఆయా వర్గాలను చైతన్యపరుస్తాం. బీసీ ల మూలాలను తుంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడతాం.
కులగణనతో ఏయే వర్గాలకు ఎలా నష్టం జరగనుంది?
బీసీల సంఖ్య పెరిగితే తమకు దక్కాల్సిన న్యాయమైన వాటాను అడుగుతారనేది పాలకుల భయం. తమ వెనకబాటు, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ప్రభుత్వరంగాల్లో అవకాశాల ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కులాల లెక్కలు బయటపెడితే వారంతా చైతన్యమవుతారనే ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఒకవేళ లెక్కలు బహిర్గతం చేయకుంటే వారంతా సైలెంట్ అవుతారనే కుట్ర ఇందులో దాగుంది. రాజకీయ చైతన్యం ఆయా కులాల్లో పెరుగుతుందని, అసమర్థ పథకాలపై ప్రశ్నించడం ప్రారంభమవుతుందన్న భయంతోనే ప్రభుత్వం సమగ్రంగా సర్వే రిపోర్టును వెల్లడించలేదని స్పష్టమవుతున్నది.