చిక్కడపల్లి, అక్టోబర్ 21: ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సంస్మరణ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సాయిబాబాకు కాళ్లు లేకున్నా సమాజానికి నడక నేర్పాడని అన్నారు. ఆయన జీవితాంతం ప్రజాస్వామిక పోరాటాలు చేశారని వివరించారు. బీజేపీ పాలనలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నిర్వర్యం అయ్యాయని విమర్శించారు. ప్రొఫెసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ..
సాయిబాబా ఉద్యమాల తీరు తెన్నులకు ఆదర్శం అని అన్నారు. ఈ దేశంలో నిజమైన నేరస్థులు తాము దోచుకున్న సంపదతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని, ఏ నేరం చేయని సాయిబాబాను మాత్రం శిక్షించారని మండిపడ్డారు. రాజ్యం సాయిబాబా పట్ల క్రూరంగా వ్యవహరించడం అన్యాయమని పేర్కొన్నారు. సభలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభధ్రం, రచయిత మీనా కందస్వామి, సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు.