హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 ( నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో 23 వేల స్కూళ్లను రద్దు చేస్తామన్న యోచనను సీఎం రేవంత్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలి.. లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్, ఆచా ర్య మాడభూషి శ్రీధర్ సహా పలువురు హెచ్చరించారు. బడిలేని గ్రామాన్ని ఊహించుకోవడమే ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘సీఎం స్కూళ్ల రద్దు ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ఓ వైపు సర్కారీ స్కూళ్ల అభివృద్ధికి కమిషన్లు వేసిన సీఎం.. మరోవైపు సర్కారీ స్కూళ్లు అవసరం లేదని వాటి రద్దుకు ఆదేశాలిస్తుండటం ఏ తరహా పాలనో అర్థమే కావడం లేదని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా సొంతంగా తన నిర్ణయాలను ప్రకటించడమేమిటని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా రాచరిక వ్యవస్థలోనా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులు లేరనే సాకుతో స్కూళ్లను మూసివేస్తామంటున్నారని, మరి విద్యార్థులు ఎందుకు లేరో? సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనని నిలదీశారు.
విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వ స్కూళ్లలో వసతులు ఎందుకు లేవు? అనే విషయాలను చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే విద్యారంగానికి బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా ఇదే అంశంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వకుంటే వ్యర్థమేనని విమర్శించారు. ఇప్పుడు విద్యారంగం వ్యాపారంరంగంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
అందులో తెలంగాణ కొంత మెరుగ్గా ఉన్నదని అనుకొంటే ఆ నమ్మకం కూడా కోల్పోయేలా చేస్తున్నారని వాపోయారు. విద్యారంగంపై మురళితో కమిషన్ ఏర్పాటు చేశారని, ఆ కమిషన్ నివేదిక ఇచ్చే లోపే కేశవరావు కమిషన్ వేయడంతో దానిని కేశవరావుకు అందించామని తెలిపారు. కనీసం నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు చదువెందుకు? దళితులకు ఎందుకు? అని కొందరు అంటున్నారని, ఇలాంటి భావజాలం ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.
రాజ్యంగ లక్ష్యాలు సాధించాలంటే కేవలం విద్యతోనే సాధించగలమని చెప్పారు. గురువు అంటే చదువు చెప్పే, జ్ఞానాన్ని అందించే వారని, కానీ విశ్వ గురువు ఏమిటి? అని ప్రశ్నించారు. పిల్లలను జ్ఞానానికి దూరంగా ఉంచడమే విశ్వగురు విధానమా? అని హరగోపాల్ ప్రశ్నించారు. తామంతా ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నామని తెలిపారు.
కొత్తగా ఎస్టేట్స్ సరసన రియల్ ఎస్టేట్ వచ్చేసిందని ఆచార్య మాడభూషి శ్రీధర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్కూళ్లను రద్దు చేసి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు వెలుస్తాయని చెప్పారు. మనం చదువుకునే స్కూల్ ఇకపై ఉండదేమో? మనం కూర్చున్న సీటు కనిపించదేమో? నిజంగా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తంచేశారు. 2009లో విద్యాహక్కు వచ్చిందని ఇప్పుడు చదువుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితులు వస్తున్నాయని వివరించారు. విద్యారక్షణ కోసమే కాదు రాజ్యాంగరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. ఇప్పుడు హిట్లర్లు వచ్చారని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రభుత్వ స్కూళ్లు రద్దు చేయాలని చూస్తే ఈ పాలకులు గద్దెదిగే వరకు పోరాడుతామని వక్తలంతా ముక్తకంఠంతో హెచ్చరించారు. అనేక త్యాగాలతో తెలంగాణను సాధించుకుంటే విద్యారంగాన్ని రేవంత్ సర్కార్ నాశనం చేస్తున్నదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కే చక్రధర్‌రావు విమర్శించారు. 21వేల కోట్లతో తెరపైకి వచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వెనుక ఆంతర్యమేమిటని సీపీఐ మాస్‌లైన్ హైదరాబాద్ కార్యదర్శి హన్మేశ్ ప్రశ్నించారు.
బెంగళూరు వేదికగా సీఎం స్కూళ్ల రద్దు ప్రకటన అక్కడున్న ప్రేక్షకులు తలలు దించుకునేల చేసిందని ప్రొఫెసర్ నర్సింహారెడ్డి మండిపడ్డారు. ప్రతీ గ్రామంలో సర్పంచులకు లేఖలు ఇస్తామని, అన్ని జిల్లాలో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెస్తామని కే లక్ష్మీనారాయణ వివరించారు. ప్రభుత్వ స్కూళ్లు రద్దయితే మొదట బాలికలే చదువుకు దూరమవుతారని హెచ్‌సీయూ ప్రొఫెసర్ భవానీ ఆందోళన వ్యక్తంచేశారు.
కేసీఆర్ హయాంలో మనఊరు-మనబడి కార్యక్రమంతో స్కూళ్లను మెరుగుపరిచారని, కానీ, ఇప్పటి పాలకులు ప్రైవేట్‌రంగం వైపున ఉన్నందునే ప్రభుత్వ స్కూళ్లు రద్దు చేస్తామంటున్నారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్ విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, అరుణోదయ విమలక్క, ప్రొఫెసర్ సుజాత, న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్ధన్, ఎంవీ ఫౌండేషన్ వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.