కరీంనగర్ కార్పొరేషన్: నగర పాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయని, సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపడుతాయని అనుకున్నారు. అయితే గతంలో కంటే కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేకపోగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సదుపాయాలు మెరుగుపడకపోగా కనీసం తమ సమస్యలు ఎక్కడ చెప్పుకొవాలో కూడా తెలియని దుస్థితి ఇప్పుడు ఆ విలీన గ్రామాల్లో నెలకుంది. నెల రోజుల క్రితమే కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు ఐదు గ్రామాలు కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. ఆయా గ్రామాల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్న మున్సిపల్ అధికారులు.. వార్డు ఆఫీసర్లను కూడ నియమించారు. అక్కడి పంచాయతీ కార్యాలయాలకు వార్డు ఆఫీసులంటూ బోర్డులు పెట్టారు. కానీ వాటిని తీసేది లేదు, ప్రజలకు అందుబాటులో ఉండేది లేదు అన్నట్లుగా పరిస్థితి మారింది. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను ఎవ్వరి చెప్పుకొవాలో, వినేవారు ఎవ్వరు అనేది తెలియక అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా విషయంలోనూ వచ్చే సమస్యలు వినే వారే లేకుండా పోయారు. వార్డు కార్యాలయం ఉన్నా అక్కడ అధికారులు అనేవారేవ్వరూ కూడ కనిపించడం లేదు. ఉన్న వార్డు ఆఫీసర్లు కూడ ఆయారం, గయారం అన్నట్లు మారింది పరిస్థితి. దీంతో విలీన గ్రామాల్లో పాలన కాస్తా పడకేసింది. ఈ విషయంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు నగరపాలక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోయినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.
నగరంలోని 60 డివిజన్లకు 60 మంది వార్డు ఆఫీసర్లను నియమించిన నగరపాలక ఉన్నతాధికారులు, విలీన గ్రామాల్లోనూ వార్డు ఆఫీసర్లను నియమించారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో రెండు వార్డులుగా విభజించి రెండు వార్డు ఆఫీసర్లను నియమించగా.. మిగిలిన విలీన గ్రామాలకు ఒక్కొక్కరి చొప్పున నియమించారు. ఈ వార్డు ఆఫీసర్లకు తోడు ప్రతి ఒక్కరికి అసిస్టెంట్లను కూడ నియమించారు. అయితే ప్రతి రోజు ఈ వార్డు ఆఫీసర్లు నగరపాలక కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్యలో బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసుకొని కానీ వార్డు కార్యాలయాలకు వేళ్లే పరిస్థితి లేదు. కాగా ఇప్పుడు ఉన్నతాధికారులు పూర్తిగా ఆస్తి పన్నులపైనే వారి దృష్టి సారించమని చెప్పడంతో వారు దానికే పరిమితం అవుతున్నారు. పన్నుల వసూళ్ల కోసం వార్డు ఆఫీసర్, అసిస్టెంట్ కలిసి వెళ్తుండటంతో వార్డు కార్యాలయాలు మూతలు పడుతున్నాయి. దీంతో విలీన గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర సమస్యలపై కనీసం పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. స్థానికంగా ఉన్న సమస్యలను వార్డు ఆఫీసర్లు చూసుకుంటారని నగరపాలక ఉన్నతాధికారులు చెబుండగా, అసలు తమకేమి తెలియదన్నట్లుగా వార్డు ఆఫీసర్లు వ్యవహరిస్తున్నారు. ఉదయం పూట ఓ అర గంట వార్డు కార్యాలయాల్లో ఉంటున్న ఈ ఆఫీసర్లు ఆ తర్వాత అటువైపుగా కూడ కన్నెత్తి చూడటం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఏదైనా సమస్యను అధికారుల దృష్టికి తీసుకపోవాలంటే కార్యాలయం ఎప్పుడు మూసే ఉంటుందని పేర్కొంటున్నారు.
గ్రామాలు, మున్సిపాలిటీ విలీనంతో నగరం విస్తరించగా.. అధికారులు మాత్రం విస్తరించిన నగరానికి అనుకూలంగా చర్యలు తీసుకొవటంతో విఫలం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. విలీన గ్రామాల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని చెప్పుతున్న ఉన్నతాధికారులు అక్కడ కనీసం ఓ సిబ్బంది కూడ లేకపోవటంతో అవి మూసి ఉంటున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోకపొవటం గమనర్హం. విలీన గ్రామాల ప్రజలు ఏలాంటి సమస్యలు విన్నవించాలన్న నగరంలోని బల్దియా కార్యాలయానికే రావాలన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆయా గ్రామ ప్రజల సమస్యలను, ఇతర పనుల నిమిత్తం ఎవ్వరిని కలువాలో…. ఎక్కడ దరఖాస్తులు కూడ చేయాలో తెలియని పరిస్థితి నెలకుంది. ఓ వైపు ఉన్నతాధికారులు అన్నింటికి వార్డు ఆఫీసర్ చూస్తారని చెప్పుతుంటే…. అసలు ఆ వార్డు ఆఫీసర్లే వార్డు కార్యాలయాలకు కూడ రావటం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. సమస్యలను ఎవ్వరికి చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నగరం విస్తరించిన తీరులో అధికారులను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాల్సినా అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
కార్యాలయం ఎప్పుడు తీస్తున్నారో తెలియటం లేదు
గ్రామంగా ఉన్నప్పుడు నయం.. నగరంలో కలిసిన తర్వాత ఏ పని చెప్పిన కావటం లేదు. గ్రామంగా ఉన్నప్పుడు పంచాయితీ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఉండే వారు. ఇప్పుడు ఆ కార్యాలయానికి సిబ్బంది కూడ రావటం లేదు. అసలు వార్డు ఆఫీసర్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియటం లేదు. వారు ఎంత సేపు ఆస్తి పన్నుల వసూళ్లు తప్ప ఇతర సమస్యలను పట్టించుకోవటం లేదు. స్థానికంగా ఉండే సిబ్బంది కూడ ఎవ్వరి ఆధ్వర్యంలో పని చేస్తున్నారో తెలియటం లేదు. వార్డు ఆఫీసర్లు నామ్కే వస్తా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కనీసం రోజు వారి పనులు చేయటంలో కూడ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా నగరపాలక అధికారులు వార్డు కార్యాలయాల్లో ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే చిన్న సమస్యలను కూడ ఎవ్వరికి చెప్పే పరిస్థితి లేదు. ఏ విషయం అయినా నగర కార్యాలయంలోనే చెప్పుకొవాలి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రతి పనికి నగరంలోకి కార్యాలయానికే వెళ్లాలంటే ఇక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. పంచాయితీ కార్యాలయం ఉన్న అది ఎందుకు పని చేయటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్థానికంగా నగరపాలక సంస్థ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.
– సంపత్రావు, దుర్శెడ్ మాజీ ఉపసర్పంచ్
పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది
నగరపాలక సంస్థలో విలీనం అయినా తర్వాత గ్రామాన్ని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. వార్డు ఆఫీసర్ అనే వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అన్నది తెలియటం లేదు. కనీసం ప్రజలు ఎవ్వరైనా కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను చెప్పుదామన్న కార్యాలయం ఎప్పుడు మూసే ఉంటుంది. పారిశుద్ధ్యం, నీటి సరఫరా విషయంలో పనులు సాగుతున్న వీటిని పర్యవేక్షణ చేసే అధికారులు లేకపోవటంతో అధ్వాన్నంగా మారుతుంది. కనీసం ఏ విషయాన్ని ఏ అధికారి దృష్టికి తీసుకపోవాలన్న విషయం కూడ సృష్టత లేకుండా పోయింది. ఎవ్వరైనా అధికారులకు ఫోన్ చేస్తే ఇది తమ పరిధిలోకి రావటం లేదని చెప్పుతున్నారు. ఇప్పటికే మా గ్రామంలో నీటి సరఫరాకు ఇబ్బందులు వస్తున్నాయి. వేసవిలో ఎలాంటి చర్యలు చేపడుతారన్న విషయంలో ఏ అధికారులతో మాట్లాడాలో కూడ తెలియని పరిస్థితి ఉంది.
– తిరుపతినాయక్, చింతకుంట మాజీ ఎంపీటీసీ