Congress | తాండూరు/కామారెడ్డి/పటాన్చెరు, మే 11: బడా బాబుల కోసమే బీజేపీ పనిచేస్తున్నదని, పదేండ్లలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో పేదల నడ్డి విరిచారని మండిపడ్డారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన జనజాతర సభ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. అసమర్థ, అసంబద్ధ పాలనా విధానాలతో దేశ ఆర్థిక, సామాజిక జీవనాన్ని బీజేపీ తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు.
అద్భుత ప్రసంగాలు, అమోఘమైన వాగ్దానాలు, హావభావ విన్యాసాలు, ఆచరణ లేని ఆదర్శాలతో దేశ ప్రజలను మోదీ బురిడీ కొట్టించారని ఎద్దేవా చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించక రైతులు వ్యవసాయాన్నే మానేసే దుస్థితికి తెచ్చారని, వ్యవసాయ సబ్సిడీలు తగ్గించారని చెప్పారు. కార్పొరేట్లకు అనుకూల చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేస్తూ పేదలను నట్టేట ముంచారని ఆరోపించారు. పదేండ్ల పాలనలో గ్యాస్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా అక్కడి దేవుడిపై ఒట్టు పెట్టి మరీ రుణమాఫీ అమలు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో నమ్మకం సడలినందుకే ఆయన దేవుళ్లపై ఒట్టు పెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు భద్రాద్రి రాముడు, బాసర సరస్వతి తదితర దేవుళ్లపై ఒట్టు పెట్టిన ఆయన తాజాగా తాండూరు సభలో మాట్లాడుతూ వికారాబాద్ అనంతపద్మనాభ స్వామి సాక్షిగా ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తామని మరోమారు ఒట్టేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ పాలనకు చరమగీతం పాడాలని కోరారు.
శ్రీరాముడు అందరివాడని, బీజేపీకే సొంతం కాదని, మతాలు, దేవుళ్ల పేరుతో రాజకీయం చేసే బీజేపీని నమ్మొద్దని, అదానీ, అంబానీలను మోదీ మోస్తున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ మాట్లాడుతూ మోదీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు. సురక్షితంగా, ఆదర్శంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నాయకులు మతం మంటలు రేపి గొడవలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
తాండూరు సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతుండగానే జనాలు లేచి వెళ్లిపోవడం కనిపించింది. సభలో సరైన వసతులు లేవని వచ్చినవారు ఆగ్రహం వ్యక్తంచేశారు.