మణికొండ/సుల్తాన్‌బజార్, జూలై 18: ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారుల అండతో నిన్న వరకు రెచ్చిపోయిన వీరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా బాసటగా నిలుస్తుండటంతో స్వైర విహారం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 36, 37లోని భూములపై వివాదం ఉండటంతో పాటు హైకోర్టు స్టేటస్ కో ఉన్నప్పటికీ నెల రోజులుగా వందల కొద్దీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలిసింది. ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకున్నా జిరాక్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కానిచ్చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే నంబరు 36లోని 142.15 ఎకరాల్లో ప్రభుత్వ ఉద్యోగులు లేఅవుట్ చేసి జీహెచ్ఎంసీకి రూ.18 కోట్ల ఫీజు చెల్లించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ భూమిలోనే ప్లాట్లు యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత నెల రోజులుగా రోజుకు పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 200 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలిసింది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ సమయంలో లింకు డాక్యుమెంట్లతో పాటు భూ యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి? ఎవరికి బదిలీ అయ్యాయి? అనే క్రమాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ లేవు. కేవలం 1980వ దశకంలో జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ జిరాక్స్ ప్రతుల ఆధారంగా ప్లాట్లు చేతులు మారుతున్నాయి.
కొన్నిరోజులుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చూసి అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లింక్, ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదిస్తే ఒరిజినల్ డాక్యుమెంట్లు లేనందునే పెండింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. అంటే, తొలుత పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయడం, ఆపై సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించి పలు కారణాలు చూపి డాక్యుమెంటును రిలీజ్ చేయాలని ఉత్తర్వులు తీసుకురావడమనేది ఒక తంతుగా మారింది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 14 ప్లాట్లకు సంబంధించి పెండింగ్ రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో కోర్టుకు వెళ్లి రిలీజ్ ఉత్తర్వులు తీసుకువస్తారు. ఆపై వాటిని రిలీజ్ చేయించుకుంటారు. కానీ అసలు ఆ ప్లాటు ఎవరిది? దాని యజమాని ఎవరు? ఆ లేఅవుట్ చేసిందెవరు? దాని యజమాని ఎవరు? వారికి ఆ భూమి ఎలా వచ్చింది? హైకోర్టు స్టే ఉందా? ఇవేవీ ఎవరికీ పట్టడం లేదు. సామాన్యుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు విధించే అధికారులు వందల ప్లాట్లను చేతులు మారుస్తుండటం వెనక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనేది బహిరంగ రహస్యం. కాగా ఈ ప్రక్రియపై తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు సబ్ రిజిస్ట్రార్‌కు ఫోన్ చేసినా ఫలితం లేదంటే అధికార వ్యవస్థ ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఏకమై బీటీఎన్జీవో కేటాయించిన స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని ప్రభుత్వంతో ఓవైపు చర్చలు జరుపుతుండగా, మరోవైపు సర్వే నంబర్ 36లో మాత్రం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ఈ వ్యవహారంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి గతంలోనే ఓ కీలక మంత్రితో రూ.100 కోట్ల డీల్ పూర్తి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు సదరు సంస్థ ప్రతినిధులు దర్జాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో అసలు ప్లాటు యజమానులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
గోపన్‌పల్లి భూములపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన భూముల కబ్జాకు ప్రైవేట్ వ్యక్తులు యత్నిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే ఆ స్థలాలను గత ఉత్తర్వుల మేరకు బీటీఎన్జీవో సొసైటీకి కేటాయించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి కోరారు. శుక్రవారం సచివాలయంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు, టీఎన్జీవో రాష్ట్ర కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్, ఉపాధ్యక్షుడు ఇటిక్యాల కొండల్‌రెడ్డి సీఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఆతర్వాత సీఎంవో ప్రత్యేక కార్యదర్శి శేషాద్రిని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో సుమారు నాలుగు వేల మంది రిటైర్డ్, సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఇంటి కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారికి కేటాయించిన స్థలాన్ని అప్పగించాలని కోరారు. ఈ విషయమై విచారణ చేసి, తగు చర్యలు తీసుకుంటామని సీఎస్, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి తమకు హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.