Degree Admissions | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎదురీదుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల భారం మోయలేకపోతున్నాయి. విద్యార్థులు చేరక, అడ్మిషన్లు పెరగక కుదేలవుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 9% మత్రమే అడ్మిషన్లు జరిగాయి. 617 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మొత్తం సీట్లు 2.6 లక్షలు ఉంటే, 23,000 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లు పొందారు. దోస్త్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే ఈ విషయం తేలింది. ఏకంగా 73 ప్రైవేట్ కాలేజీల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. జీరో అడ్మిషన్లతో ఆయా కాలేజీలు వెలవెలబోతున్నాయి.
ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలను కుంగదీస్తున్నాయి. డిగ్రీ కాలేజీలకే దాదాపు రూ.1,000 కోట్ల మేరకు ప్రభుత్వం బకాయిలు ఉండటం గమనార్హం. ఆర్థికశాఖలో టోకెన్లు జారీ అయినవే దాదాపు రూ.400 కోట్ల వరకు ఉన్నాయి. బకాయిలు అందక రెండుసార్లు సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యాలు బహిష్కరించాయి. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలకు క్రమంగా దూరమవుతున్నారు. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో అద్దెలు చెల్లించకలేక, సిబ్బంది జీతాలు ఇవ్వలేక, కరెంట్ బిల్లులు కట్టలేక కాలేజీలను నడపలేకపోతున్నామని యాజమాన్యాలు చెప్తున్నాయి. బకాయిలు విడుదల కాక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వ డం లేదు. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు.
అటానమస్ కాలేజీల హవా
రాష్ట్రంలో డిగ్రీ విద్యలో అటానమస్ కాలేజీలదే హవాగా సాగుతున్నది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ప్రభుత్వ, యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోని సీట్లే నిండుతున్నాయి. ఈసారి యూనివర్సిటీ అటానమస్ కాలేజీల్లోని మొత్తం సీట్లలో 96.28% సీట్లు దోస్త్ మొదటి విడతలోనే నిండాయి. ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కాలేజీల్లో 46.90% సీట్లు నిండగా, ఎయిడెడ్ అటానమస్లో 66%, ప్రైవేట్ అటానమస్లో 26.42% సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొత్తం సీట్లలో కేవలం 16శాతం సీట్లు మాత్రమే నిండాయి.
అమ్మభాషలకు నిరాదరణ
డిగ్రీ విద్యలో అమ్మభాషలకు ఆంగ్ల గ్రహణం పట్టుకున్నది. డిగ్రీ ఫస్టియర్లో చేరిన వారిలో అత్యధికులు ఇంగ్లిష్ మీడియంలోనే అడ్మిషన్లు పొందారు. తెలుగు, హిందీ, ఉర్దూ మీడియాల్లో విద్యార్థులు చేరడమే లేదు. ఈసారి ఏకంగా 96శాతానికి పైగా విద్యార్థులు ఆంగ్ల మీడియంలోనే ప్రవేశాలు పొందారు. మొదటి విడతలో సీట్లు పొందిన 60 వేల మందిలో 58 వేల మంది ఇంగ్లిష్ మీడియంలోనే అడ్మిషన్లు పొందారు. తెలుగు మీడియంలో కేవలం 1,552 మంది మాత్రమే చేరగా, హిందీ మీడియంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చేరలేదు. ఉర్దూ మీడియంలో 309 మంది చేరారు.