Telangana Crime | లాగుల తొండలు ఇడుస్తా! పండబెట్టి తొక్కుతా! పేగులు మెడలో వేసుకుంటా! రక్తం పొలాలకు పారిస్తా! గద్దెలు కూలుస్తా! కనుగుడ్లు పీకి గోటీలాడుతా! బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా!.. ఇప్పుడు రాష్ట్రంలో తరచూ వినిపిస్తున్న మాటలివి. అధికార పక్షం అసహనం నుంచి, ముఖ్యనేత ఫ్రస్ట్రేషన్ నుంచి బూతులు, బెదిరింపుల వరద పారుతున్నది. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా మొదలవుతున్న అరాచక భాషకు.. ఆఖరికి ప్రభుత్వ అధికారులు, మేధావులు, సామాన్యులు బాధితులుగా మారుతున్నారు. ప్రతీకార ప్రసంగాలతో నేరమయ వాతావరణం పెరుగుతున్నది. ప్రభుత్వ పెద్దల మాట తీరుతో సమాజ స్వభావం మారుతున్నది.
పైకి ప్రస్ఫుటంగా కనిపించదు కానీ, అంతర్లీనంగా ప్రభావం కనిపిస్తుంది. నేరాల సంఖ్య పెరుగుతున్నది. ఫలితంగా రెండున్నరేండ్లలో రాష్ట్రంలో క్రైమ్‌రేటు గణనీయంగా పెరిగి పోయింది. జాతీయ క్రైమ్‌రికార్డు బ్యూరో గణాంకాల ప్రకారం 2023లో 1.83 లక్షల కేసులు నమోదైతే 2024లో అవి 2.18 లక్షలకు చేరాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది.. అంటే 2024లో రాష్ట్రంలో నమోదైన తీవ్ర నేరాల సంఖ్య క్రితం ఏడాదికన్నా 273 శాతం పెరిగింది.
ఎవరు వీళ్లంతా? ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నరు? ఎవరినీ లెక్క చేయని ధోరణి.. ఏదైనా మాట్లాడొచ్చనే ఆలోచన.. అధికారం అండదండలు.. మౌన ప్రేక్షకులుగా మారిన పోలీసు వ్యవస్థ.. నేరస్తుల తయారీకి ఉపకరిసున్నది. ప్రభుత్వ పెద్దలు బాధ్యతమరచి అరాచక భాష మాట్లాడుతుంటే.. శాంతిభద్రతలను గాలికొదిలి, పోలీసులను పొలిటికల్ గేమ్‌లోకి దించుతుంటే.. నేరధోరణికి నీరుపోసినట్టే! అసాంఘిక శక్తులకు అవకాశమిచ్చినట్టే!
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) ; రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః, పాపే పాపపరాః సదా.. రాజానమనువర్తంతే యథా రాజాః తథా ప్రజాః’ అని భారతీయ నీతిశాస్త్రం చెప్తున్నది. పాలకుల భాష, ప్రవర్తన క్రమంగా పాలనా వ్యవస్థలోకి.. అకడినుంచి పౌర సమాజంలోకి ప్రవహిస్తాయి. అందుకే అధికారంలో ఉన్న వ్యక్తి మాట పాలనాసంసృతికి దిక్సూచి. అందుకే ప్రభుత్వాధినేత ప్రసంగం కేవలం.. ఆయన ముందు కూర్చున్నవారికే పరిమితం కాదు. అది మరునాడు వార్తవుతుంది. మీడియాలో ప్రసారమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివిధ మాధ్యమాల ద్వారా ఇంటింటికీ చేరుతుంది. ప్రభుత్వ వైఖరికి ప్రతిబింబమవుతుంది. పౌరులపై ప్రభావం చూపుతుంది. పౌర సమాజంలో నేరస్వభావం కలిగినవారు ఒక శాతం ఉంటారట. మరో 3 శాతం మందిలో ఓ తరహా ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్’ అతి నిగూఢంగా, అంతర్లీనంగా దాగి ఉంటుందని మనోవైజ్ఞానిక అధ్యయనాలు చెప్తున్నాయి. తన ప్రవర్తనకు సామాజిక మద్దతు ఉండదనే భయం ఉన్నప్పుడు.. అతను తన మానసికస్థితిని లోలోన బలవంతంగా అణచుకుంటాడు. అలా అంతర్లీనంగా అణచివేయబడిన క్రూర స్వభావానికి అనువైన వాతావరణం, అనుకూల పరిసరాలు ఉన్నప్పుడు అసలు మనిషి బయటకు వస్తాడని ప్రముఖ మనోవైజ్ఞానిక నిపుణుడు ఆల్బర్ట్ బండూరా చెప్పారు.
దీన్ని ఆయన ‘లేటెంట్ అగ్రెషన్’ (సుప్త దూకుడు ప్రవృత్తి) అని పిలిచారు. ‘ప్రతిపక్ష నేతలను కోస్తా!’.. ‘ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కుతా!.. ‘పేగులు తీసుకొని మెడలో వేసుకుంటా!’.. ‘కనుగుడ్లు పీకి గోటీలాడుతా!’.. ‘వాళ్లను కోసి ఆ నెత్తురును పొలాలకు పారిస్తా!’ లాంటివి కొంతకాలంగా రాజకీయాల్లో తరచూ వినపడుతున్న మాటలు. ముఖ్యనేత, ప్రభుత్వ పె ద్దలు, అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా వాడుతున్న ఇలాంటి భాష.. నేరపూరిత శక్తుల మస్తిష్కాలకు ఆ మాటలు డోపమైన్లా ఎక్కుతున్నది. ఆ అరాచక భాష సమాజ స్వభావం లో ‘లేటెంట్ అగ్రెషన్’ను ప్రేరేపించేలా ఉన్న ది. బలహీన మనస్తత్వం ఉన్నవాళ్లు, సున్నిత స్వభావులు, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్లు ఉత్తేజం పొందుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలే కాదు, ఒక్కోసారి అధికారులూ, కొన్నిసార్లు సామాన్యులపైనా ఆ మా టల దాడి కొనసాగుతున్నది. కాళేశ్వరం నీళ్లు ఎత్తాలని లేఖ రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను జైల్లో వేయాలన్నా.. వర్షాభావ పరిస్థితులు రాబోతున్నాయన్న వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా.. అడ్డూఅదుపు లేని మాటలు బెదిరింపు ధోరణి క న్నా, నాయకుల్లోని ఫ్రస్ట్రేషన్‌ను వెల్లడిస్తున్నాయి.
నేరం అనేది కేవలం పోలీస్‌స్టేషన్‌లో నమోదయ్యే ఎఫ్ఐఆర్ కాదు. సమాజం ఏ దిశగా ప్రయాణిస్తున్నదో చెప్పే అద్దం. పాలకుడి నైతికత ఎట్లా ఉన్నది? చట్టవ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉన్నది? నేరప్రపంచం ఎంత వేగంగా రూపం మార్చుకుంటున్నది? నియంత్రణ వ్యవస్థ ఏమేరకు కట్టడి చేస్తున్నది? అని వెల్లడించే సూచిక. తెలంగాణలో క్రైమ్ గ్రాఫ్ ఆందోళనకరంగా పెరుగుతున్నదని జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) చెప్తున్నది. ఈ ఏడాది మేలో విడుదలైన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో నమోదైన మొత్తం నేరాల సంఖ్య ఒక ఏడాదిలోనే 18.7 శాతం పెరిగింది. 2023లో 1,83,644 కేసులు నమోదవగా, 2024లో ఆ సంఖ్య 2,17,976 కు చేరింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల తీవ్రత అధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నేరాలలో జాతీయ సగటు ప్రతి లక్ష మంది జనాభాకూ 418.9గా ఉండగా.. తెలంగాణలో అది 568.9గా ఉన్నది. తీవ్ర స్వభావం కలిగిన నేరాల్లోనూ భారీగా పెరుగుదల నమోదవడం ఆందోళన కలిగించే మరో అంశం.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులతో పోల్చిచూస్తే రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, తీవ్రమైన దాడుల వంటి భయంకర నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. 2022లో 9,673, 2023లో 10,069 కేసులు నమోదవగా, 2024లో ఒకసారిగా అవి 27,447కు చేరాయి. అంటే రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే భయంకరమైన నేరాల సంఖ్య అసాధారణ స్థాయిలో 273 శాతం పెరిగాయి. సైబర్ నేరాలూ 2024లో 49 శాతం పెరిగి 27,230కు చేరాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నమోదైన కేసు లు కూడా గణనీయంగా పెరిగాయి. 2023తో పోలిస్తే డ్రగ్స్ కేసులు వందశాతం పెరిగినట్టు నివేదిక పేర్కొన్నది. మరో కీలకాంశం మానవ అక్రమ రవాణా! దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో దాదాపు 20 శాతం తెలంగాణలోనే నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేర విభాగంలో తెలంగాణ జాతీయస్థాయిలో ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచినట్టు గణాంకాలు చెప్తున్నాయి.
జైలుగోడలు కూడా వ్యక్తి స్వభావాన్ని బయటపెడుతాయి. రాష్ట్రంలో క్రూరపోకడలు విస్తరిస్తున్న నేపథ్యంలో జైళ్ల రికార్డులూ పరిశీలనా అంశాలే. ఒకరి నేరచరిత్రను పోలీసు డైరీ వెల్లడిస్తే.. సమాజంలో పెడధోరణుల ముఖచిత్రాన్ని ఆవిష్కరించేది జైలు గుమ్మమే. ఏడాది పొడవునా ఎలాంటి నేరాల్లో ఎంతమంది జైలుకు వచ్చారు? ఏ తరహా నేరాలు పెరుగుతున్నాయి? ఏ వర్గానికి చెందిన నిందితులు ఎకువగా వస్తున్నారు? అనే ప్రశ్నలకు రాష్ట్ర జైళ్లశాఖ రికార్డుల్లో సమాధానం దొరుకుతుంది. జైళ్లశాఖ విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక ప్రకారం, అంతకుముందు ఏడాదితో పోల్చితే విచారణ ఖైదీల సంఖ్య 11.8 శాతం పెరిగింది. 2024లో 38,079 మంది అండర్‌ట్రయల్స్ కొత్తగా జైలుకు రాగా, 2025లో ఆ సంఖ్య 42,566కు పెరిగింది. అంటే ఏడాదిలోనే దాదాపు 4,500 మంది అదనంగా వివిధ నేరాల కేసుల్లో జైళ్లకు చేరాన్నమాట. ఆందోళన కలిగించే మరో విషయమేందంటే.. వాళ్లలో అత్యధికులు చిన్నాచితక నేరాల్లో వచ్చినవారు కారు.. హత్యలు, దోపిడీలు, పిల్లలపై లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన కేసుల్లో అరెస్టయినవారు.
హత్య కేసుల్లో నిందితులుగా జైలుకు వచ్చినవారి సంఖ్య 2,754 నుంచి 3,260కు (18.3 శాతం) పెరిగింది. పోక్సో కేసుల్లో నిందితులుగా జైలుకు వచ్చినవారి సంఖ్యలో ఏడాది వ్యవధిలోనే 3,750 నుంచి 4,176కు (11.36 శాతం) పెరుగుదల నమోదైంది. 2024తో పోల్చితే మాదకద్రవ్యాల కేసుల్లో 11.6 శాతం పెరుగుదల కనిపించగా, సైబర్ నేరాల కేసుల్లో జైళ్లకు వచ్చినవారి సంఖ్య 135.6 శాతం పెరిగింది. ఊరూరా ఏరులై పారిస్తున్న మద్యం పాలసీకి తోడు.. ఊరూరా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విస్తరించాయి. దీని ఫలితంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో జైళ్లకు వచ్చిన వారి సంఖ్య 152% పెరగడం గమనార్హం. జైళ్లశాఖ నివేదికలో మరో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. 2025లో జైలుకు వచ్చినవారిలో అత్యధికులు మొదటిసారిగా నేరాలకుపాల్పడిన నిందితులే. ఆ ఏడాది మొత్తం 42,566 మంది విచారణ ఖైదీలు కొత్తగా రాగా, వారిలో సుమారు 40 వేల మంది తొలిసారి జైలుకు వచ్చినవారే. అంటే సంప్రదాయ నేరస్తుల కంటే, కొత్తగా నేరాలకు పాల్పడిన వారి సంఖ్య పెరుగుతున్నదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో మహిళలు, బాలికల మీద దాడులు పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం మహిళలపై నమోదైన నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే ఆందోళనకర స్థానంలో నిలిచింది. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య 24,495 కేసులు నమోదయ్యాయి. సగటున ప్రతి లక్ష మంది మహిళల్లో 129 మంది బాధితులుగా నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. నమోదైనవాటిల్లో ఎక్కువ కేసులు కుటుంబసభ్యుల వేధింపులకు సంబంధించినవి. వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, మోసపూరిత వివాహాలు, వేధింపుల రూపాలు మారుతున్నా.. బాధితులు మాత్రం మహిళలే అవుతున్నారు. రాష్ట్రంలో బాలికల భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతున్నది. పోక్సో చట్టం కింద 2024లో రాష్ట్రవ్యాప్తంగా 2,103 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ జైళ్ల శాఖ గణాంకాల ప్రకారం 2025లో ఈ కేసుల్లో జైలుకు వెళ్లిన నిందితుల సంఖ్య 3,750 నుంచి 4,176కు (11.36 శాతం) పెరిగింది.
అంటే బాలికలపై లైంగికనేరాల తీవ్రత తగ్గకపోగా, కాంగ్రెస్ ఏలుబడిలో మరింతగా పెరుగుతున్నాయని తేటతెల్లమవుతున్నది. పోక్సో కేసుల్లో రాజకీయ ప్రముఖుల కుటుంబసభ్యుల పేర్లూ ఇటీవల పలుమార్లు వార్తల్లోకి రావడం చర్చనీయాంశమవుతున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై నమోదైన కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, నిందితుడికి బెయిల్ దక్కేలా ప్రభుత్వం తీరు ఉన్నదని విమర్శలు వెల్లువెత్తాయి. షాబాద్ ఘటనలోనూ పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా.. నిందితుడిని కనీసం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించలేదని, ఆయనకు బెయిల్ దక్కేవరకు స్వేచ్ఛగా తిరగనిచ్చారని వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే నిందితుడు ఆరుగురిని హత్యకు అవకాశం చిక్కిందని తెలుస్తున్నది. ఒకవైపు ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నచోట.. పోలీసుశాఖ అచేతనంగా మారడం విమర్శలపాలవుతున్నది. మరోవైపు ప్రభుత్వాధినేత మాటల తీరు.. తీవ్ర నేరాల స్థాయిని సాధారణ వ్యవహారాల్లా మార్చేస్తున్నది.
ఒకప్పుడు రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన నేరగాళ్లు… ఇప్పుడు పట్టపగలే తుపాకులు, కత్తులు, గొడ్డళ్లతో వ్యాపార సంస్థల్లోకి చొరబడి దోపిడీలకు తెగబడుతున్నారు. నిరుడు ఆగస్టు 12న హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్‌ను ఆయుధాలు ధరించిన ఆరుగురు లూటీ చేశారు. రాష్ట్ర రాజధానిలో పట్టపగలు తుపాకులతో జరిగిన ఈ దాడి సంచలనం సృష్టించింది.ఈ ఘటన మరచిపోకముందే 2026 జనవరి 31న హైదరాబాద్‌లోని కోఠిలో ఏటీఎంలో నగదు జమచేసే ఉద్యోగిపై తుపాకీ పేలింది. కాల్పులు జరిపి, రూ.6 లక్షల నగదుతో దుండగులు పరారయ్యారు. జనసంచారం ఎకువగా ఉండే ప్రాంతంలో, పట్టపగలే జరిగిన ఈ ఘటన నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇటీవల మే 3న కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో అంతర్రాష్ట్ర ముఠా అత్యంత పకా ప్రణాళికతో దోపిడీకి పాల్పడింది. వ్యాపార సంస్థలే కాదు… ఉన్నతాధికారుల ఇండ్లూ సురక్షితం కాదనే పరిస్థితిని మరో ఘటన బయటపెట్టింది. 2026 మే 8న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీ వినయ్ రంజన్రే భార్యను దారుణంగా హత్యచేసి, ఇంటిని దోచుకెళ్లారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నిందితుడు బాధితురాలు, ఆమె తల్లి, నాయనమ్మను హత్య చేయడంతోపాటు తన భార్య, ఇద్దరు చిన్నారులనూ చంపడం తీవ్ర కలకలం రేపింది. రెండు గంటల్లో రెండు కుటుంబాలకు చెందిన ఆరు ప్రాణాలు బలికావడం, కేసు నమోదు చేసిన బాధిత కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకోవడం చట్టవ్యవస్థ, బాధితుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. అంతకుముందు నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. సుపారీ ముఠాల చేతిలో దంపతులు, ఇద్దరు పిల్లలు హత్యకు గురయ్యారని తేల్చారు. వరంగల్ జిల్లా పదహారు చింతల తండాలో జరిగిన జంట హత్యలూ అప్పట్లో కలకలం రేపాయి. క్షణికావేశ హత్యల స్థానంలో ముందస్తు ప్రణాళిక, సుపారీ ముఠాల వినియోగం, డిజిటల్ ఆనవాళ్లను చెరిపివేసే ప్రయత్నాలు వంటి కొత్త ధోరణులు కూడా దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేస్తున్నాయి.నేర స్వభావంపై ప్రభావం
పార్టీ సభలైనా, అధికార వేదికలైనా ముఖ్యనేత మాట్లాడుతున్న అరాచక భాష.. నేరస్వభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో నేరాల స్వరూపమే మారుతున్నది. దాడులు, దౌర్జన్యాలు ప్రతీకార హత్యలు, పట్టపగలు సాయుధ ముఠాల దోపిడీలు, జంకు లేకుండా సాగిస్తున్న నేరాలు, మహిళలకు వేధింపులు, బాలికలపై అఘాయిత్యాలు, లైంగికదాడులు, డ్రగ్స్ వినియోగం, మానవ అక్రమ రవాణా, నేర ముఠాల సైర్వవిహారం రాష్ట్రంలో పెచ్చరిల్లింది.
నేరాలకు సంబంధించి నమోదవుతున్న గణాంకాలు ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఫిర్యాదు వరకూ రాని, నమోదుకే నోచుకోని ఘటనలెన్నో! రెండున్నరేండ్లుగా తెలంగాణ సమాజంలో నేరస్వభావం క్రమంగా విస్తరిస్తున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. జిల్లాలు, ప్రాంతాలు మారినా… నేరాల వెనుక క్రూరత్వం మాత్రం ఒకేలా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అర డజను హత్యలు చేసి, పట్టపగలు షాపులు దోచుకొని తాపీగా నేరస్తులు వెళ్తున్నారంటే దాని అర్థం ప్రభుత్వమన్నా, పోలీసులన్నా ఎవరికీ భయం లేని పరిస్థితికి శాంతిభద్రతలు దిగజారాయని స్పష్టమవుతున్నది.
ఒక మనిషి తాలూకు వ్యక్తిగత ఆలోచనా ధోరణి.. సమాజపు ఆలోచనా ధోరణిగా మారినప్పుడు ఆ సమాజం కుళ్లిపోతుంది. అచ్చంగా.. ఒక చెద పురుగు నుంచి వెయ్యి చెద పురుగులు పుట్టినట్టు!
-ఓ సైకాలజిస్టు వ్యాఖ్య