PM Modi | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోమారు అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, విభజన వల్ల రెండు రాష్ర్టాలు అన్యాయమైపోయినట్టు మాట్లాడారు. అటు ఆంధ్రప్రదేశ్ కానీ.. ఇటు తెలంగాణ ప్రజలు కానీ సంతోషంగా లేనే లేరంటూ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు వల్లెవేశారు. తాము అధికారంలో ఉన్నప్పడు ఏ గొడవలు లేకుండా రాష్ర్టాలను నిశ్శబ్దంగా విభజించామని చెప్పుకొచ్చారు. ఏపీ విభజన సరిగా జరిగి ఉంటే తెలంగాణ భవిష్యత్తు మరోలా ఉండేదని మొసలి కన్నీరు కార్చారు. పాత పార్లమెంటు భవనంలో మోదీ చేసిన చివరి ప్రసంగం మొత్తం తెలంగాణపై ద్వేషభావంతో నిండిపోయింది. ‘ఈ పార్లమెంట్ భవనం వేదికగా వాజపేయి ప్రభుత్వ హయాంలో మూడు రాష్ర్టాల ఏర్పాటు జరిగింది. ఛత్తీస్‌గఢ్ ఏర్పడిప్పుడు ఇటు ఛత్తీస్‌గఢ్‌లోనూ, అటు మధ్యప్రదేశ్‌లోనూ సంబురాలు చేసుకున్నారు.
ఉత్తరాఖండ్ ఏర్పాటు తర్వాత అటు ఉత్తరాఖండ్‌లో, ఇటు ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు ఉత్సవాలు జరుపుకొన్నారు. జార్ఖండ్ ఏర్పడినప్పుడు కూడా అటు జార్ఖండ్‌లో, ఇటు బీహార్‌లో పండుగ వాతావరణం నెలకొన్నది. అయితే ఇదే పార్లమెంట్లో ఒక చేదు జ్ఞాపకం కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారీ పోరాటాలు జరిగాయి. రక్తం ఏరులై పారింది. కానీ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అటు తెలంగాణలు ప్రజలు ఉత్సవాలు చేసుకోలేదు. ఇటు ఆంధ్రా ప్రజలు సంతోషంగా లేరు. నాడు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు. ప్రజలు కోరుకున్న విధంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విభజన జరిగి ఉంటే.. తెలంగాణ ఇప్పడు మరింత ఉజ్వలంగా ఉండేది’ అని మోదీ వ్యాఖ్యానించారు.
బిల్లు ఆమోదించిన 10 రోజుల నుంచే విషం
జూలై 2013లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. అప్పుడు మోదీ బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. మనసు చంపుకొని మరీ క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతించారు. 2014 ఫిబ్రవరి 18, 19లో తెలంగాణ ఏర్పాటు బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఆ వెంటనే మోదీలోని అసలు రంగు బయటపడింది. బిల్లు ఆమోదం పొందిన సరిగ్గా పదిరోజులకు అంటే.. ఫిబ్రవరి 28న తన మనసులోని విషాన్ని కక్కేశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ‘తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పుట్టుకను అవమానించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సందర్భం దొరికిన ప్రతిసారి తెలంగాణను అవమానించడం మోదీకి పరిపాటిగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం అనేక సందర్భాల్లో ఇలాగే తెలంగాణ ఏర్పాటుపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. సోమవారం పాత పార్లమెంట్ భవనంలో జరిగిన చివరి సమావేశంలోనూ మోదీ మరోసారి తెలంగాణ పుట్టుకను అవమానపరిచారు. రాష్ట్ర ఏర్పాటు సరిగా జరగలేదని, తెలంగాణ వచ్చినా ప్రజలు సంతోషపడలేదంటూ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారు.
మోదీకి కనిపించని సంబురాలు
పచ్చకామెర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. తెలంగాణపై కండ్లమంటతో, కడుపు మంటతో ఉన్న మోదీకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడున్నర కోట్ల మంది ప్రజలు చేసుకున్న సంబురాలు కనిపించలేదు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందగానే ప్రజలంతా రోడ్లమీదికి వచ్చి ‘జై తెలంగాణ’ అంటూ ఉత్సవాలు చేసుకున్నారు. గులాల్ చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. ఇవేవీ మోదీ కండ్లకు కనిపించలేదు, బీజేపీకి వినిపించలేదు. తెలంగాణ విభజన సరిగా ఉంటే తెలంగాణ ఉజ్వలంగా ఉండేదన్న మోదీ వ్యాఖ్యలపైనా తెలంగాణ ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది.
దేశంలోని అన్ని రాష్ర్టాలను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నదని గుర్తు చేస్తున్నారు. ప్రధాన మంత్రి పదవిలో ఉండి, రాష్ట్ర అభివృద్ధిని పదేండ్లుగా స్వయంగా చూస్తూ కూడా ఇలా మాట్లాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్డీపీ వృద్ధిరేటులో, తలసరి ఆదాయ వృద్ధిలో, సొంత రాబడుల వృద్ధిలో, ధాన్యం ఉత్పత్తిలో, కొత్త పరిశ్రమల స్థాపనలో, ఐటీ ఎగుమతుల్లో ఇలా ఏ రంగంలో చూసినా తెలంగాణ అనతి కాలంలోనే గుజరాత్‌ను, ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాలను వెనక్కు నెట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. మోదీ దీనిని తట్టుకోలేకపోతున్నారని అనడానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా అందులో మేజర్ వాటా తెలంగాణ రాష్ర్టానికే దక్కుతున్నదని, మరి దీనినేమంటారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి చూడాలని, కావాలంటే అధికారుల నుంచి గణాంకాలు తెప్పించుకొని తెలంగాణ తొమ్మిదేండ్లలోనే ఆత్మగౌరవాన్ని చాటుతూ ఎలా సమున్నతంగా ఎదిగిందో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలు సూచిస్తున్నారు.
బీజేపీది దశాబ్దాల దుష్మనీ
వాస్తవానికి తెలంగాణపై బీజేపీ దుష్మనీకి దశాబ్దాల చరిత్ర ఉన్నది. 1998లో తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ కాకినాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేక తీర్మానం చేసింది. ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అనే నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నెత్తికి ఎత్తుకున్నది. తర్వాత కాడి పడేసింది. ‘అభివృద్ధిలో ప్రాంతాల మధ్య భేదాలు చూపుతున్నారనే కారణంతో రాష్ర్టాన్ని ఏర్పాటు చేయలేం’ అంటూ 2002లో అప్పటి కేంద్రమంత్రి ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించారు. ‘రాజధాని ఉన్న ప్రాంతం ప్రత్యేక రాష్ర్టాన్ని కోరడం ఏంటి?’ అంటూ మరో సందర్భంలో ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత ప్రధాని మోదీతోపాటు బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. అందులో కొన్ని..
2014 ఫిబ్రవరి 28:(కర్ణాటకలోని గుల్బర్గాలో..)
‘తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారు. సీమాంధ్ర ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనాథగా మార్చివేసింది’
2014 ఏప్రిల్ 30: (తిరుపతిలో..)
‘తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు’
2018 ఫిబ్రవరి 7: (పార్లమెంట్లో..)
‘ఎన్నికల్లో లబ్ధి కోసం పార్లమెంట్ తలుపులు మూసి ఏపీని విభజించారు. రాజకీయ స్వార్థం తో హడావుడిగా ఏపీ విభజన నిర్ణయం తీసుకున్నారు’
2018 జూలై 21: (పార్లమెంట్లో..)
‘కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి ఒక రాష్ర్టాన్ని విభజించింది. తల్లిని చంపి బిడ్డను బతికించింది వాస్తవం కాదా?’
2022 ఫిబ్రవరి 8: (పార్లమెంట్లో..)
‘ఏపీ విభజన సరిగా జరుగలేదు. దర్వాజాలు బంద్ చేసి, ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు. పెప్పర్ స్ప్రే దాడులు చేయించారు. ఏపీ విభజనతో సమస్యలు వచ్చాయి’
సెప్టెంబర్ 18, 2023: (పాత పార్లమెంట్ భవన స్మృతులను గుర్తు చేసుకుంటూ…)
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారీ పోరాటాలు జరిగాయి. రక్తం ఏరులై పారింది. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అటు తెలంగాణలు ప్రజలు ఉత్సవాలు చేసుకోలేదు. ఇటు ఆంధ్రా ప్రజలు సంతోషంగా లేరు. నాడు రాష్ట్ర విభజన సరిగా జరగలేదు. ప్రజలు కోరుకున్న విధంగా, ఉత్సాహభరిత వాతావరణంలో విభజన జరిగి ఉంటే.. తెలంగాణ ఇప్పడు మరింత ఉజ్వలంగా ఉండేది’