(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 8, (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే పరనిందలు, చౌకబారు విమర్శలకే పరిమితమయ్యారు. తమ కోసం ఏదో తెస్తారని, ఏదో ప్రకటిస్తారని ఆశగా చూసిన తెలంగాణ ప్రజలకు మళ్లీ నిరాశే మిగిల్చారు. ప్రధాని వరంగల్ పర్యటన, ప్రసంగం ఆద్యంతం చప్పగా సాగింది. ఆయన ప్రసంగంలో ఎక్కడా ఉత్సాహం లేదు.. ఉత్తేజం లేదు.. ఉద్వేగం అంతకంటే లేదు. ప్రధాని రాష్ర్టానికి వస్తున్నారంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. రాష్ర్టానికి కేంద్రం ఏమి ఇవ్వబోతున్నదో ప్రకటించాలి. కానీ అవేమీ లేకుండా మోదీ తెలంగాణ సర్కారుపై అసత్య ఆరోపణలకే పరిమితమయ్యారు.
ఆత్మస్థుతి.. పరనిందలతోనే ప్రసంగాన్ని పూర్తిచేశారు. మూడు దశాబ్దాల తర్వాత వరంగల్‌కు వచ్చిన ప్రధాని.. ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఒక్కటంటే ఒక్క వరాన్ని కూడా ప్రకటించలేదు. వరంగల్‌కు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన మోదీ మామునూరులో దిగారు. మామునూరు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని వరంగల్ ప్రజల చిరకాల డిమాండ్‌నూ మోదీ పట్టించుకోలేదు. ఉత్తరాదిన మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని ఆలయం, యూపీలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఆలయ అభివృద్ధి కోసం వేల కోట్లు కుమ్మరించిన మోదీ.. తాను దర్శించుకున్న భద్రకాళి ఆలయానికి మాత్రం నయా పైసా ప్రకటించలేదు. సమక్క-సారలమ్మ పరాక్రమాన్ని ప్రస్తావించారు.. కానీ, మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలన్న డిమాండ్‌పై నోరు మెదపలేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఊసే ఎత్తలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేయలేదు. వరంగల్ ప్రజలు కేంద్రం నుంచి ఆశిస్తున్న ఏ ఒక్కదానికి కూడా ప్రధాని హామీ ఇవ్వకుండా నిరాశపరిచారు.
సీఎం కేసీఆర్ ఎక్కడికెళ్లినా వరాల జల్లే
సీఎం కేసీఆర్ ఎక్కడికెళ్లినా అక్కడ ప్రజలకు వరాల జల్లు కురిపిస్తారు. ప్రజలు డిమాండ్ చేయకున్నా ఆ ప్రాంతానికి ఏమి కావాలో గుర్తించి ప్రకటిస్తారు. అడగకుండానే మెడికల్ కాలేజీలు, దవాఖానలు ప్రకటించడం, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ప్రకటించడం, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కోట్ల రూపాయలు అప్పటికప్పుడు కేటాయించడం తెలిసిందే. తొలిసారి వరంగల్‌కు పర్యటనకు వచ్చిన మోదీ.. సీఎం కేసీఆర్ మాదిరిగా వరాలు కురిపిస్తారేమోనని ప్రజలు ఆశించారు. కానీ అడియాశలు చేశారు.
తిట్టడానికే వచ్చారా?
రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కోసం వచ్చినట్టుగా కాకుండా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడానికే మోదీ వరంగల్‌కు వచ్చినట్టుగా ప్రవర్తించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేనితనంతో తన అక్కసును వెళ్లగక్కారు. దొంగే.. దొంగ..దొంగ..అని అరిచినట్టుగా బీఆర్ఎస్ సర్కారుపై ప్రధాని మోదీ విమర్శలు.. అసత్య ఆరోపణలు చేశారు.
ఇవి మోదీకి గుర్తుకు లేదా?
ప్రధాని మోదీ ప్రసంగంలో బీఆర్ఎస్ది కుటుంబ పాలన అంటూ రెచ్చిపోయారు. కుటుంబ పార్టీలతో అంటకాగుతూ బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన అని విమర్శించి తెలంగాణ ప్రజల్లో మోదీ చులకనైపోయారు. మహారాష్ట్రలో నిన్నగాక మొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ వర్గాన్ని బీజేపీ తన ప్రభుత్వంలో చేర్చుకొన్నది. అంతకుముందు శివసేన పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేను ఏకంగా సీఎంను చేసింది.
ఎన్సీపీ, శివసేన రెండు పార్టీలు శరద్ పవార్, బాల్‌థాక్రేకు చెందిన కుటుంబ పార్టీలే. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా కొనసాగిన అకాళీదళ్ ప్రకాశ్‌సింగ్ బాదల్‌కు చెందిన కుటుంబ పార్టీనే. యూపీలో అప్నాదళ్ కుటుంబ పార్టీనే. లోక్‌జన శక్తి, ఈశాన్య రాష్ర్టాల్లోని నేషనల్ పీపుల్స్ పార్టీ ..ఇవన్నీ కుటుంబ పార్టీలేనన్న విషయం మోదీకి గుర్తుకు లేదా? బయటనుంచి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీపీ, బిజు జనతాదళ్ పార్టీలు కూడా కుటుంబ పార్టీలేనన్న విషయాన్ని మరిచిపోయారా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే కుటుంబ పార్టీలన్న విషయం గుర్తుకు రాదా? ఇవ్వకపోతే కుటుంబ పార్టీలు అయిపోతాయా? అని రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు.