Islamabad : పాకిస్తాన్ రాజధాని, ఇస్లామాబాద్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 24 మంది మరణించగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్‌లోని, షెహజాద్ పట్టణం, తర్లాయ్ ఇమాంబర్గా వద్దగల మసీదులో మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం, మెయిన్ గేట్ వద్ద ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 24 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు.
బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా దళాలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్), పాలీ క్లినిక్‌లకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆత్మాహుతికి ఎవరు పాల్పడ్డారు.. ఏ పేలుడు పదార్థం వాడారు వంటి అంశాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ దాడిలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉంది.
మసీదు గేటుతోపాటు, చుట్టుపక్కల బిల్డింగులు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. శరీర భాగాలు చాలా దూరం ఎగిరిపడ్డాయి. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. గత నవంబర్‌లో కూడా ఇస్లామాబాద్‌లో ఇలాంటి దాడే జరిగింది. అప్పటి ఘటనలో 12 మంది మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. ఇక.. తాజా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.