రుద్రంపూర్, ఫిబ్రవరి 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి, యజమాన్య పద్ధతులపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ వరి పరిశోధన కేంద్రం, హైదరాబాద్‌కు చెందిన డా.మహేంద్ర కుమార్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. పద్మావతి హాజరై రైతులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా.టి.భరత్ అధ్యక్షత వహించారు. రైతులను ఉద్దేశించి డా.పద్మావతి మాట్లాడుతూ.. వరి పంటలో చీడపీడల నివారణకు వారు అభివృద్ధి చేసిన లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టల వినియోగంపై రైతులకు ప్రాక్టికల్‌గా వివరించారు. అనంతరం డా.మహేంద్ర కుమార్ మాట్లాడుతూ.. నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతి గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. ఈ సాగు విధానంలో కలిగే లాభాలు, ఖర్చు తగ్గింపు, పంట దిగుబడి పెరుగుదలతో పాటు ఈ పద్ధతిలో గడ్డిని ఎలా నియంత్రించాలో కూలంకషంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యుదయ రైతుల అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకుని ఇతర రైతులకు తెలియజేశారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం ఫామ్‌లో డ్రోన్ పద్ధతిలో వరి సాగు విధానాలను రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. అలాగే గిరిజన రైతులకు డ్రమ్ సీడర్ పరికరాన్ని అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాయపాడు గ్రామం (అల్లపల్లి మండలం), పెనగడప గ్రామం (చండుగొండ మండలం), నిమ్మలగూడెం గ్రామం, సుజాతనగర్ మండలం నుండి సుమారు 80 మంది రైతులు పాల్గొన్నారు.

వరి వెదజల్లే పద్ధతులపై రైతులకు శిక్షణ