తనతో కలువాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ ఆహ్వానించి, అంటించిన నిప్పు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్ఠానంలో పెద్ద మంటే రాజేసింది. వివిధ మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న ఢిల్లీ పెద్దలు రేవంత్‌రెడ్డి తీరుపై అగ్గిమీద గుగ్గిలమయ్యారట. బీజేపీతో సంబంధాలు, కేంద్రమంత్రులతో సాన్నిహిత్యం, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చిన ఆరోపణలు వంటివన్నీ అధిష్ఠానం చేతికి చేరాయని సమాచారం. ఈ విషయం తేల్చేయాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు రేవంత్ రెడ్డికి సమాచారం అందిందట. దీంతో ఆయన హఠాత్తుగా రాహుల్ రాగం అందుకున్నారు.
హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో.. అక్కడికి చేరుకోలేరు. అందుకే నాతో కలువండి’.. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. ‘గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉన్నది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో నాకు చాలా చొరవ ఉన్నది. నేను నా గీత దాటను. 2024 నుంచి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి, ఆయన ఇచ్చిన చైర్లో నేను కూర్చుంటా’.. శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన వివరణ ఇది.
పరేడ్ గ్రౌండ్లో మోదీ ప్రసంగం కంటే కూడా ‘నాతో కలువండి’ అని చేసిన వ్యాఖ్యల మీదే అటు ప్రధాన మీడియా, ఇటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. మోదీ ఆ మాట ఎందుకు అన్నారు? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆనాడు మన్మోహన్సింగ్ ప్రభుత్వం గుజరాత్‌కు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని చెప్పదలుచుకున్నారా? లేకవేరే ఉద్దేశంతో అన్నారా? అని చర్చలు జరుగుతున్నాయి. రేవంత్‌రెడ్డిని బీజేపీలో చేరాలని మోదీ పరోక్షంగా ఆహ్వానించారని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానానికి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి మీద అనుమానం మొదలైంది. ఆయన గతంలో చంద్రబాబుతో అంటకాగి, తెలంగాణలో టీడీపీ పుట్టిముంచి, కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారని, ఇదే తరహాలో మోదీ ఇచ్చిన ఆఫర్‌తో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ముంచి బీజేపీ కండువా కప్పుకొంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో 70 శాతం మంది కార్యకర్తలు ఇదే విషయాన్ని నమ్ముతున్నట్టు రేవంత్‌రెడ్డి అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రేవంత్‌రెడ్డిపై ఈ స్థాయిలో అపనమ్మకం ఏర్పడటానికి బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఏబీవీపీలో ప్రారంభించారని, రాష్ట్రంలో ఇప్పటికీ బీజేపీ ఎజెండానే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వ స్థలాలు, పాఠశాలల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించారని, తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూట్ మార్చ్ మీద ఆంక్షలు పెట్టిందని, కానీ తెలంగాణలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను పక్కన పెట్టి బీజేపీ ఎజెండాను పక్కాగా అమలు చేశారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. సీఎం ఇప్పటివరకు 69 సార్లు ఢిల్లీకి వెళ్లినా అనేక సందర్భాల్లో ఏఐసీసీ అగ్రనేతలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, కానీ ఆయన అడిగిన వెంటనే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిందని చెప్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని, దీంతో కనీసం 6 సీట్లలో ఓడిపోయామని ఢిల్లీ పెద్దలు భావించారు. దీనిపై విచారణ సైతం జరిపించిన సంగతి తెలిసిందే. రేవంత్‌రెడ్డి మొదటి నుంచీ బీజేపీతో టచ్‌లో ఉన్నారని, మధ్యలో వారధిలా చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయన కనుసన్నల్లోనే రేవంత్ నడుస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసినా అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. చివరికి ఏఐసీసీలోని ఆయన మార్గదర్శి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేశారని చర్చ జరుగుతున్నది. అంతా సవ్యంగా నడుస్తుందని అనుకుంటుండగా ప్రధాని మోదీ ‘మేరే సే హీ జోడో’ అంటూ కొత్త పాచిక విసిరి, కాంగ్రెస్‌ను మళ్లీ కన్ఫ్యూజన్లోకి నెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మోదీ వ్యాఖ్యలతో అధిష్ఠానం తనను అనుమానించే పరిస్థితి వచ్చిందని తెలుసుకొని, సీఎం రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు చెప్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పరోక్షంగా అధిష్ఠానానికి వివరణ ఇచ్చినట్టు విశ్లేషిస్తున్నారు. తాను పదేండ్లు టీడీపీలో పనిచేశానని, చంద్రబాబు ఇప్పటికీ తనను గౌరవిస్తారని చెప్పడం ద్వారా గాంధీ కుటుంబంపై తాను అదే విశ్వాసంతో ఉంటానని పరోక్షంగా సూచనలు పంపారన్నారు. వికారాబాద్ సమావేశంలో ప్రధాని పదవి తీసుకోవాలని తానే రాహుల్ గాంధీకి చెప్పి ఒప్పించానని రేవంత్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ అని ముందుగా కాంగ్రెస్ తరఫున ప్రకటిస్తే, కూటమిలోని మిగతా పార్టీలను ఒప్పిస్తానని చెప్పారు. కూటమి తరఫున ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి, దేశ ప్రజలను తీర్పు కోరుతామని తెలిపారు. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నం గా 2034 వరకు తానే సీఎంగా ఉంటానని ప్రకటించుకున్నారు. 2034 తర్వాత తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని చెప్పారు. మొత్తానికి మోదీ పేనిన ఉచ్చు రేవంత్‌రెడ్డి మెడ కు చుట్టుకున్నదని, అందుకే తాను మోదీకి కా దు గాంధీ కుటుంబానికే విశ్వాస పాత్రుడినని చెప్పుకోవడానికి అనేక పాట్లు పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ప్రైవేట్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బాలికపై బండి భగీరథ్ లైంగిక ఆరోపణల విషయంలో తనకు రాహుల్ గాంధీ నుంచి మెసేజ్ వచ్చినట్టు చెప్పారు. వాస్తవానికి బాలిక తల్లి ఈనెల 8 పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపు 6 గంటల పాటు ప్రాధేయపడినా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. కానీ భగీరథ్ విషయంలో మాత్రం పోలీసులు జెట్ స్పీడ్‌తో స్పందించారని, బాలిక, ఆమె తల్లిదండ్రుల మీద భగీరథ్ ఫిర్యాదు చేసిన మరునిమిషమే కరీంనగర్ పోలీసులు హనీ ట్రాప్ కేసు నమోదు చేశారన్న విమర్శలు ఉన్నాయి. పైగా భగీరథ్‌పై సాధారణ సెక్షన్లు నమోదు చేయడం సంచలనంగా మారింది. మహిళ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిరసనలు తెలిపినా, రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా ఘటనపై నోరు తెరువలేదు. పొన్నం ప్రభాకర్ ఒక్కరే మాట్లాడగా, ఆయనకు పార్టీ నుంచి నోటీసులు వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో జరుగుతున్న వ్యహారాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న రాహుల్‌గాంధీ స్వయంగా రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టారని పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. అప్పటికీ సీఎం రేవంత్‌ను నమ్మలేదని, ఈ కేసులో జోక్యం చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడిని ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో చలనం వచ్చిందని అంటున్నారు. దీనిని కవర్ చేసుకునేందుకే ప్రధాని బందోబస్తుతో కాలయాపన జరిగిందంటూ సీఎం చెప్పినట్టు తెలిసింది.