PM Modi | ఆదిలాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
ఉదయం 10.20 గంటలకు ప్రధాని హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభ వేదిక వద్దనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం సమీపంలో శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఇందులో 800 మెగావాట్ల రామగుండం ధర్మల్ పవర్ ప్రాజెక్టు, యాదాద్రి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
ఆదిలాబాద్, బేల రెండు వరుసల రోడ్డు విస్తరణ పనులను, ఆదిలాబాద్ పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, ఇతర పనులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడి 12.15 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయలుదేరుతారు. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు పట్టణంలో పూర్తి బందోబస్తు ఏర్పాటుచేశారు.
అంబారి-ఆదిలాబాద్ రైల్వేలైన్ ప్రారంభం
అంబారి-ఆదిలాబాద్- పింపల్‌కుట్టి రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ సోమవారం జాతికి అంకితం చేయనున్నారు. అంబారి-ఆదిలాబాద్- పింపల్‌కుట్టి రైల్వేస్టేషన్ల మధ్య సుమారు రూ.70 కోట్ల వ్యయంతో 71 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ప్రధాని రాక నేపథ్యంలో అన్ని ఏర్పాట్లన్నీ పూర్తిచేశామని చెప్పారు.
ఈ లైన్లో 46.6 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉండగా.. మిగిలినది మహారాష్ట్రలో ఉన్నది. దక్షిణ మధ్య రైల్వేలో భాగమైన సికింద్రాబాద్-నాగపూర్ (నిజామాబాద్ మీదుగా) సెక్షన్ తర్వాత ఈ మార్గం వస్తుందని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు పూర్తి కావడం వల్ల హైదరాబాద్ మీదుగా బెంగళూరు, నాగపూర్ వైపు, అలాగే ఉత్తర భారతదేశం వైపు ప్రయాణ సదుపాయాలు, సరుకు రవాణా మరింత మెరుగవుతుందని అన్నారు.
ప్రధాని పర్యటనను నిరసిస్తూ బైక్ ర్యాలీ
ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటనను నిరసిస్తూ పట్టణంలో జిల్లా అభివృద్ధి సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ జిల్లాలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని ఆందోళనకారులు విమర్శించారు. మూతబడిన సిమెంటు పరిశ్రమను పునఃప్రారంభించాలని, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వేలైన్ పనులు ప్రారంభించాలని, ఎయిర్‌పోర్టును నిర్మించాలని, నవోదయ పాఠశాలను ఏర్పాటుచేయాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఓట్లు దండుకోవడం కోసం కేవలం ఎన్నికల సమయంలో జిల్లా పర్యటనలకు వస్తారని, హమీలతో ప్రజలను మభ్యపెడుతారని మండిపడ్డారు.