హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ) : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలో 25న ప్రత్యేకంగా ప్రగతి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణతోపాటు సంబంధిత రాష్ర్టాలకు కేంద్రం సమాచారం పంపింది. పోలవరం డ్యామ్‌ను సత్వరం పూర్తిచేసి నీటినిల్వ చేసేందుకు ఏపీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆ దిశగా ఏపీ సర్కారు సైతం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. అయితే పోలవరం ప్రాజెక్టు ముంపు, భూసేకరణ, పునరావాసం, ప్రజాభిప్రాయసేకరణ ఇతరత్రా సాంకేతిక అంశాలపై తెలంగాణ సహా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సైతం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా రాష్ర్టాలతో ఏకంగా ప్రధాని మోదీనే గత నెల 28న ప్రత్యేకంగా ప్రగతి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాష్ర్టానికి చెందిన ఇరిగేషన్ ప్రాజెక్టుపై దేశ ప్రధాని ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై విమర్శలు ఎదురయ్యాయి. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీతతో పోలవరంపై కేంద్రం అప్పటికే వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో గత నెల 28న జరిగిన ప్రగతి సమావేశం ఎజెండా నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని తొలగించారు. తాజాగా మళ్లీ ఈనెల 25న సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రాజెక్టు ముంపు రాష్ట్రాలతో ప్రధాని భేటీ కానున్నారు.