నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు గురువారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు. నిందితుడిని కస్టడీకి తీసుకోవాలని మేజిస్ట్రేట్ సౌమ్య పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాలకనుగుణంగా పోలీసులు ఆయనను సాయంత్రం వరకు తమ అదుపులో ఉంచుకున్నారు.
సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వును మేజిస్ట్రేట్ కూలంకషంగా పరిశీలించి లక్ష రూపాయల చొప్పున ఇద్దరి జమానత్‌లను సమర్పించాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు విధించిన షరతుల ప్రకారం దేశం వదిలి వెళ్లరాదని, విచారణాధికారికి సహకరించాలని, ప్రతి వాయిదాకు కోర్టుకు విధిగా హాజరుకావాలని లేని పక్షంలో బెయిల్ రద్దవుతుందని స్పష్టంచేశారు. జమానత్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభాకర్‌రావు కోర్టు నుంచి నేరుగా విడుదలయ్యారు. దర్యాప్తు అధికారి సేకరించిన సమాచారం ప్రకారం ఈ కేసులో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.