సుభాష్‌నగర్/ కంఠేశ్వర్, డిసెంబర్ 22: కాంగ్రెస్ ప్రభుత్వంపై ధూప, దీప, నైవేద్య పథకం అర్చకులు సమరానికి దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందూరు(నిజామాబాద్) నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 22 నుంచి జనవరి 7వ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న అర్చక చైతన్య యాత్రలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ కాలనీలోని కమ్యూనిటీ భవన్లో సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా నుంచి 600 మంది అర్చకులు హాజరయ్యారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ధూపదీప నైవేద్య అర్చక సంఘం (డీడీఎన్) రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ మాట్లాడు తూ.. 2007లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఈ పథకం ద్వారా 7వేల మంది అర్చకులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రతినెలా డీడీఎన్ అర్చకులకు వేతనం, ధూప, దీప, నైవేద్యానికి రూ.35 వేలు, ప్రతినెలా 5 లోగా వేతనం, హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతిజిల్లా కేంద్రంలో అర్చకభవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల అర్చకుల త్రీమెన్ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రతి జిల్లా నుంచి ఇద్దరు డీడీఎన్ అర్చకులకు కమిటీలో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని డీడీఎన్ అర్చకుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.