యాదాద్రి భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. అలాగే ట్రిపుల్ ఆర్ రైతులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో లక్ష్మీనరసింహస్వామి పరిసర ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు. దీంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. వేసవి సెలవులు రావడంతో యాదగిరిగుట్టకు భక్తుల రద్దీ పెరిగింది.
కొండపైకి స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొండపైకి ఉచిత బస్సు సర్వీసును కూడా అధికారులు నిలిపివేశారు. దీంతో వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొండపైకి వచ్చిన భక్తులను కూడా దర్శనానికి అనుమతించకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో నేడు సీఎం గుట్టకు వస్తుండటంతో సరైన ఏర్పాట్లు లేక భక్తులు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు.